Konda Surekha | మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

మంత్రులు, నేతల్లోనూ అసంతృప్తి ఉందని వ్యాఖ్య

ఢిల్లీ, ఆంధ్రప్రభ : తన కూతురు చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేసి చర్యలు తీసుకోవద్దని మంత్రి కొండా సురేఖ అన్నారు. తనపై చర్యలు తీసుకునే ముందు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆమె వ్యాఖ్యానించారు. పదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని సీఎం చెప్పుకుంటున్నారని, ఇది క్రమశిక్షణా చర్యల కిందకు రాదా? అని ప్రశ్నించారు. మహిళలు స్వతంత్రంగా జీవించాలని రాహుల్‌గాంధీ చెబుతున్నారని పేర్కొన్నారు.

ఢిల్లీలో జరిగిన చిట్‌చాట్‌లో కొండా సురేఖ పలు కీలక వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. తనను రాజీనామా చేయాలని ఇప్పటివరకు ఎవరూ కోరలేదని ఆమె తెలిపారు. తన కూతురు మాట్లాడిన అంశాలను తనకు ఆపాదించి చర్యలు తీసుకోవడం సరికాదని పేర్కొన్నారు. తనపై చర్యలు తీసుకునే ముందు ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

బీసీకి ఒక న్యాయం.. ఇతర సామాజిక వర్గాలకు మరో న్యాయమా? అని సురేఖ ప్రశ్నించారు. పలువురు మంత్రులపై అనేక ఆరోపణలు ఉన్నాయని, వాటిపై ఏం సమాధానం చెబుతారని, ఎలాంటి చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. పార్టీ అధిష్ఠానానికి తనకు తెలిసిన అంశాలను ఇప్పటికే రాతపూర్వకంగా తెలియజేశానని వెల్లడించారు.

మంత్రులు, ఇతర నేతల్లోనూ అసంతృప్తి ఉందని కొండా సురేఖ వ్యాఖ్యానించారు. పదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని చెప్పడం క్రమశిక్షణ ఉల్లంఘన కిందకు రాదా? అని ప్రశ్నించారు. మహిళలు స్వతంత్రంగా బతకాలనే విషయాన్ని రాహుల్‌గాంధీ చెబుతున్నారని, ఆ స్ఫూర్తికి అనుగుణంగానే తాను మాట్లాడుతున్నానని ఆమె పేర్కొన్నారు.