Konda Surekha Controversy | సురేఖ వివాదంపై అధిష్ఠానానికి సీఎం రేవంత్‌రెడ్డి నివేదిక
- త్వరగా నిర్ణయం తీసుకోవాలని అధిష్ఠానానికి సీఎం విజ్ఞప్తి
- నేడు ఏఐసీసీ నిర్ణయం?
హైదరాబాద్/ఢిల్లీ, ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: మంత్రి కొండా సురేఖను చుట్టుముట్టిన వివాదం కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టికి వెళ్లింది. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పార్టీ అధిష్ఠానానికి నివేదిక అందించారు. వివాదానికి సంబంధించిన అంశాలను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లిన సీఎం.. కొండా సురేఖపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరినట్లు తెలుస్తోంది.
కొండా సురేఖ కూతురు స్మిత చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో, ఇతర వివరాలను టీపీసీసీ ఇంగ్లిష్‌లోకి అనువదించి పార్టీ అధిష్ఠానానికి పంపినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పూర్తి వివరాలతో కూడిన నివేదికను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ కే.సీ. వేణుగోపాల్‌కు అందించినట్లు సమాచారం.
కొండా సురేఖ వివాదంపై నేడు నిర్ణయం?
ఈ వ్యవహారంపై ఏఐసీసీ స్థాయిలో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ క్రమశిక్షణ, నేతల వ్యాఖ్యలు, వివాదానికి దారితీసిన పరిస్థితులను పరిశీలించిన అనంతరం అధిష్ఠానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మంత్రి కొండా సురేఖ ఇప్పటికే తన వైఖరిని స్పష్టం చేశారు. తన కూతురు చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేసి చర్యలు తీసుకోవడం సరికాదని ఆమె పేర్కొన్నారు. తనపై చర్యలు తీసుకునే ముందు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కూడా వ్యాఖ్యానించారు.
కొండా సురేఖ చేసిన తాజా వ్యాఖ్యలు, మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి అధిష్ఠానానికి నివేదిక సమర్పించినట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. అధిష్ఠానం ఈ అంశాన్ని ఏ విధంగా పరిష్కరిస్తుందన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
