BREAKING | హైదరాబాద్‌ చేరుకున్న కొండా సురేఖ

  • షోకాజ్‌ నోటీసులపై అధిష్ఠానానికి వివరణ ఇచ్చా

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: మంత్రి కొండా సురేఖ ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ చేరుకున్నారు. తన కుమార్తె వ్యాఖ్యలకు సంబంధించి పార్టీ జారీ చేసిన షోకాజ్‌ నోటీసులపై కాంగ్రెస్‌ అధిష్ఠానానికి వివరణ ఇచ్చినట్లు ఆమె తెలిపారు. పార్టీ పెద్దలను కలిసి చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పానని, అధిష్ఠానం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నానని ఆమె పేర్కొన్నారు.

షోకాజ్‌ నోటీసుకు ఇప్పటికే తన వివరణ ఇచ్చినట్లు సురేఖ తెలిపారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు సంబంధించి తన వైఖరిని పార్టీ పెద్దలకు వివరించినట్లు చెప్పారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్‌ క్రమశిక్షణా కమిటీ సురేఖ నుంచి వివరణ కోరిన విషయం తెలిసిందే. ఆమె ఇచ్చిన సమాధానాన్ని పరిశీలించిన అనంతరం క్రమశిక్షణా కమిటీ తన నివేదికను ఏఐసీసీకి పంపినట్లు గతంలో పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఢిల్లీలో సురేఖ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. అలాగే పార్టీ ముఖ్య నేతలతోనూ సమావేశమై తెలంగాణలో చోటుచేసుకున్న పరిణామాలపై తన వాదనను వివరించినట్లు సమాచారం.

మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ కూడా ఢిల్లీలో పార్టీ అగ్రనేతలను కలిశారు. దీంతో సురేఖ వ్యవహారంపై అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.

తనను మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఇప్పటివరకు ఎవరూ కోరలేదని సురేఖ స్పష్టం చేసినట్లు సమాచారం. తాను కూడా స్వచ్ఛందంగా రాజీనామా చేసే ప్రసక్తి లేదని ఆమె పేర్కొన్నారు. తనపై చర్యలు తీసుకునే ముందు ఇతర నేతల విషయంలో పార్టీ అనుసరించిన విధానాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆమె అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు.