వేసవిలో రోడ్డు సౌఖ్యం.. ఇది కోమటిపాలెం జనం కోటి కష్టాలు
( ఆకివీడు , ఆంధ్రప్రభ):

గాలివానాలోనూ పడవే దిక్కు
మనం చాలాచోట్ల అయితే రోడ్డు ప్రయాణం చూస్తాం.. లేదంటే పడవలో ప్రయాణం చూస్తాం… కానీ ఆ ఊరు ప్రజలు మాత్రం కాలాన్ని బట్టి వారి ప్రయాణం కూడా మారుతుంది. వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం.. అది ఎక్కడో కాదు కైకలూరు మండలం ఆటపాక నుండి కోమటిపాలెం వెళ్లే దారి వేసవిలో మాత్రమే అక్కడ నీళ్లు ఇంకిపోతాయి. అప్పుడే ఆ రహదారి గుండా ఆ గ్రామానికి చేరుకుంటారు. మిగిలిన కాలాల్లో కొల్లేటి సరస్సు కావడంతో ఒక్కసారిగా ఆ రోడ్డు మొత్తం మునిగిపోతుంది. నీటి ప్రవాహం ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ఆ ప్రాంత ప్రజలకు మాత్రం ఇక్కట్లు మొదలవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోమటి లంక నుంచి కైకలూరు చేరుకోవడానికి కేవలం ఒక 500 మీటర్ల సరస్సు దాటితే ఐదు కిలోమీటర్లలో కైకలూరు చేరుకుంటారు. ఆ ప్రయాణం కాకుండా చుట్టూరా తిరిగి రావాలంటే మాత్రం సుమారు 15 కిలోమీటర్ల దాకా ఉంటుందని, పిల్లల స్కూలుకు వెళ్లే సమయం ఎక్కువగా లేనందున అందరికీ అలవాటైన ఈ మార్గాన్ని ఎంచుకుంటామని ఆ గ్రామస్తులు తెలుపుతున్నారు. ఆ గ్రామంలో 1200 మంది జనాభా ఉన్నారని ఎటువంటి ఇబ్బంది వచ్చినా,అవసరం వచ్చినా కైకలూరు రావాల్సిన పరిస్థితి వస్తుందని రావాలంటే ఇదే దారి కూడా రాలేక ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. చిన్న చిన్న పిల్లలతో ఈ పడవ ప్రయాణం చేస్తుంటే భయంతో బిక్కుబిక్కుమని రావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

200 మంది పిల్లలు మా గ్రామం నుంచి కైకలూరు చదవడానికి వెళ్తారు. ఎన్నో ప్రభుత్వాలు మారినా బ్రిడ్జ్ పడలేదు. వేసవిలోనే దారి ఉంటుంది. మిగిలిన కాలంలో దారి ఉండదు. చిన్నపిల్లలయినా ఈ దారి నుంచే దాటి వెళ్ళాలి. గ్రామంలో స్కూల్ లేక బయటికి వెళ్లే చదువుకోవాలి. అటు నుంచి దూరమవుతుంది. గాలివానైనా,తుఫాన్ అయినా ఇటే వెళ్ళాలి. ముఖ్యంగా చదువులకి ఇబ్బంది పడుతున్నాం.
– చిన్న జ్ఞాన సుందరి. కోమటి లంక గ్రామం.
కూటమి ప్రభుత్వం చదువుకునే విద్యార్థులకు అనేక సంస్కరణలతో మేలు చేస్తున్నప్పటికీ, మా గ్రామాల్లో మాత్రం స్కూలుకు వెళ్లే మార్గం లేక ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ప్రభుత్వం ఎప్పటికైనా మా గ్రామంలో బ్రిడ్జి నిర్మించి గ్రామస్తులకు మేలు చేయాలని కోరుకుంటున్నారు.

