virat| వన్డేల్లో కోహ్లీ అరుదైన ఘనత..
వన్డేల్లో కోహ్లీ అరుదైన ఘనత..
- న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో చారిత్రక మైలురాయి
- ఈ ఘనత సాధించిన ప్రపంచ తొలి బ్యాటర్‌గా విరాట్ రికార్డు
- రెండో స్థానంలో రికీ పాంటింగ్.. 12,662 పరుగులతో తర్వాతి స్థానం
ఆంధ్రప్రభ, అక్లాండ్ : టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్‌లో మరో చారిత్రక ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూజిలాండ్‌తో ఆక్లాండ్‌లో జరుగుతున్న తొలి వన్డేలో మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 13 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన ప్రపంచ తొలి బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో తన నిలకడైన ప్రదర్శనతో మరోసారి ప్రత్యేక గుర్తింపు పొందాడు.
251 ఇన్నింగ్స్‌ల్లోనే అరుదైన రికార్డు
ఈ మ్యాచ్‌కు ముందు నంబర్ 3 స్థానంలో కోహ్లీకి 12,988 పరుగులు ఉన్నాయి. మరో 12 పరుగులు చేస్తే 13 వేల పరుగుల మైలురాయిని చేరుకునే అవకాశం ఉండగా.. ఇన్నింగ్స్ ఏడో ఓవర్‌లో తన 13వ బంతికి ఆ లక్ష్యాన్ని అందుకున్నాడు. ఈ ఘనతను 251 ఇన్నింగ్స్‌ల్లోనే సాధించడం విశేషం. ఈ స్థానంలో అతడి బ్యాటింగ్ సగటు 61.55గా ఉంది. 48 సెంచరీలు, 69 అర్ధశతకాలు కూడా నమోదు చేశాడు.
పాంటింగ్‌ను వెనక్కి నెట్టి..
వన్డేల్లో మూడో స్థానంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 12,662 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. శ్రీలంకకు చెందిన కుమార సంగక్కర 9,747 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. జాక్ కలిస్ 7,774 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో కోహ్లీ, పాంటింగ్ మాత్రమే 10 వేల పరుగుల మైలురాయిని దాటారు.
నిలకడకు నిదర్శనంగా కోహ్లీ ప్రస్థానం
వన్డేల్లో మూడో స్థానం అత్యంత కీలకమైనది. తొలి వికెట్లు త్వరగా పడినప్పుడు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దడం, మంచి ఆరంభం లభించినప్పుడు స్కోరు వేగాన్ని పెంచడం వంటి బాధ్యతలను ఈ స్థానంలో బ్యాటింగ్ చేసే ఆటగాడు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇన్నేళ్లుగా ఈ బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తూ కోహ్లీ ఎన్నో రికార్డులు సృష్టించాడు. తాజాగా 13 వేల పరుగుల మైలురాయిని అందుకోవడం అతడి సుదీర్ఘ ప్రయాణంలో మరో మైలురాయిగా నిలిచింది.
