teamindia|ఆక్లాండ్‌లో టీమ్‌ఇండియాకు ప్రత్యేక స్వాగతం..

ఆక్లాండ్‌లో టీమ్‌ఇండియాకు ప్రత్యేక స్వాగతం..

  • ఆల్‌ బ్లాక్స్‌ దిగ్గజం కెవెన్‌ మీలాము సర్‌ప్రైజ్‌
  • శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మకు వ్యక్తిగత పేర్లతో కూడిన జెర్సీలు అందజేత

ఆక్లాండ్‌, ఆంధ్ర‌ప్ర‌భ : న్యూజిలాండ్‌ పర్యటనలో ఉన్న భారత క్రికెట్‌ జట్టుకు అరుదైన గౌరవం లభించింది. తొలి వన్డేకు ముందు ఆక్లాండ్‌లో భారత ఆటగాళ్లకు ప్రత్యేక స్వాగతం లభించింది. న్యూజిలాండ్‌ రగ్బీ దిగ్గజం, ఆల్‌ బ్లాక్స్‌ మాజీ ఆటగాడు కెవెన్‌ మీలాము.. టీమ్‌ఇండియా కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌, స్టార్‌ బ్యాటర్లు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మలకు ప్రత్యేక జెర్సీలను బహూకరించారు. వారి పేర్లతో రూపొందించిన రగ్బీ జెర్సీలను అందజేసి అభినందించారు. ఈ అరుదైన క్రీడా స్నేహపూర్వక క్షణాలను భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రత్యేక ఘట్టంగా అభివర్ణించింది.

క్రికెట్‌.. రగ్బీ కలయిక!

న్యూజిలాండ్‌ క్రీడా చరిత్రలో రగ్బీకి ప్రత్యేక స్థానం ఉంది. ఆ దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మక జట్టు ఆల్‌ బ్లాక్స్‌లో కీలక ఆటగాడిగా గుర్తింపు పొందిన కెవెన్‌ మీలాము.. భారత క్రికెటర్లను కలుసుకున్నారు. 1979 మార్చి 20న జన్మించిన ఆయన.. రగ్బీలో అత్యుత్తమ హుకర్లలో ఒకరిగా పేరుగాంచారు. ఈ సందర్భంగా గిల్‌, కోహ్లీ, రోహిత్‌లకు వ్యక్తిగత పేర్లతో కూడిన జెర్సీలను అందించారు. భారత ఆటగాళ్లు చిరునవ్వులతో వాటిని స్వీకరించి, మీలాముతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. ఈడెన్‌ పార్క్‌లో మ్యాచ్‌ ప్రారంభానికి కొద్దిసేపటి ముందు చోటుచేసుకున్న ఈ పరిణామం ఇరు దేశాల క్రీడా అనుబంధాన్ని చాటిచెప్పింది.

2027 ప్రపంచకప్‌పై భారత్‌ గురి

మరోవైపు, మైదానంలో భారత జట్టు దృష్టి మాత్రం వన్డే సిరీస్‌పైనే ఉంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో టాస్‌ గెలిచిన కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు. 2027 వన్డే ప్రపంచకప్‌ నేపథ్యంలో ఈ సిరీస్‌ భారత జట్టుకు కీలకంగా మారింది. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ తిరిగి జట్టులోకి రావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మరోవైపు 2019 ఫిబ్రవరి తర్వాత న్యూజిలాండ్‌ గడ్డపై భారత్‌కు వన్డేల్లో విజయం దక్కకపోవడంతో ఈ పర్యటనపై ప్రత్యేక దృష్టి నెలకొంది.

ఛాంపియన్స్‌ ట్రోఫీ తర్వాత మిశ్రమ ఫలితాలు

2025 ఆరంభంలో ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలిచిన తర్వాత భారత వన్డే జట్టు ప్రదర్శనలో నిలకడ లోపించింది. ఆ టైటిల్‌ తర్వాత ఆడిన ఆరు వన్డే సిరీస్‌లలో భారత్‌ మూడింటిలో విజయం సాధించగా, మరో మూడింటిలో ఓటమి చవిచూసింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ జట్లతో జరిగిన సిరీస్‌లలోనూ పరాజయాలు ఎదురయ్యాయి. గతంలో భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య జరిగిన వన్డే సిరీస్‌లో ఆతిథ్య జట్టు 2-1తో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత సిరీస్‌లో రోహిత్‌, కోహ్లీ అనుభవం భారత జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.