కేఎల్‌ రావు పార్క్‌ స్విమ్మింగ్‌ విద్యార్థుల ప్రతిభ

అంతర్‌ పాఠశాల ఈత పోటీల్లో పలు పతకాలు..
అభినందించిన కోచ్‌, స్విమ్మింగ్‌ సంఘం ప్రతినిధులు

చిట్టినగర్, ఆంధ్రప్రభ : విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 46వ డివిజన్‌లో ఉన్న డాక్టర్‌ కేఎల్‌ రావు పార్క్‌ స్విమ్మింగ్‌ పూల్‌ విద్యార్థులు ఈత పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచి పలు పతకాలు సాధించారు. ఆగస్టు 30న విజయవాడ గాంధీనగర్‌ స్విమ్మింగ్‌ పూల్‌లో నిర్వహించిన రోటరీ మిడ్‌టౌన్‌ అంతర్‌ పాఠశాల ఈత ఛాంపియన్‌షిప్‌-2026లో విద్యార్థులు సత్తా చాటారు.

ఈ పోటీల్లో ఐదో తరగతి చదువుతున్న ఎం. హిమశ్రీ 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో రజత పతకం సాధించింది. ఆరో తరగతి విద్యార్థిని టి. లతిక 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. ఎనిమిదో తరగతి విద్యార్థి కె. రఘు 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌, 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో స్వర్ణ పతకాలు, 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో రజత పతకం సాధించాడు.

తొమ్మిదో తరగతి విద్యార్థిని వి. భావన శివగామి 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌, 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌, 50 మీటర్ల ఫ్రీస్టైల్‌లో స్వర్ణ పతకాలు సాధించింది. అదే తరగతికి చెందిన పి. రోహిత్‌ 100 మీటర్ల ఫ్రీస్టైల్‌లో రజత పతకం, 50 మీటర్ల ఫ్రీస్టైల్‌లో కాంస్య పతకం సాధించాడు. కె. జీవన్‌ నిఖిల్‌ 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో కాంస్య పతకం సాధించాడు.

పలు విభాగాల్లో పతకాలు సాధించిన విద్యార్థులను తోటి విద్యార్థులు, స్విమ్మింగ్‌ కోచ్‌ రఫీ, ఎన్టీఆర్‌ జిల్లా స్విమ్మింగ్‌ సంఘం అధ్యక్షుడు, సభ్యులు, మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు అభినందించారు. విద్యార్థులు ఇదే స్ఫూర్తితో మరిన్ని పోటీల్లో రాణించాలని ఆకాంక్షించారు.