రాష్ట్రస్థాయి పోటీల్లో కిష్టాపూర్ విద్యార్థుల ప్రతిభ

డిబేట్‌లో రెండో స్థానం.. వ్యాసరచనలో మూడో స్థానం

జన్నారం, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌ వారధి ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా, రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో గత నెలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి డిబేట్‌, వ్యాసరచన పోటీల్లో జన్నారం మండలం కిష్టాపూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. డిబేట్‌ పోటీల్లో 9, 10వ తరగతులకు చెందిన కొత్తపెళ్లి త్రివేద, మెండే నందిని, సిలివేరి స్నాజ్ఞశ్రీ రాష్ట్రస్థాయిలో రెండో స్థానాన్ని సాధించారు. వ్యాసరచన పోటీల్లో 10వ తరగతి విద్యార్థులు ఆకుల అనన్య, చెటుపల్లి మోక్షశ్రీ, ధనాలకోట లాస్య మూడో స్థానంలో నిలిచారు.

డిబేట్‌లో రెండో స్థానానికి, వ్యాసరచనలో మూడో స్థానానికి నగదు బహుమతులతో పాటు ప్రశంసాపత్రాలు అందజేశారు. శనివారం సాయంత్రం విద్యార్థులను డీఈఓ చంద్రయ్య, ఎంఈఓ బి. రాజేందర్‌, హెచ్‌ఎం గుండ రాజన్న, గైడ్‌ టీచర్లు దాముక కమలాకర్‌, ఎదులాపురం గోవర్ధనచారి, ప్రకాష్‌ బానావత్‌, గ్రామ సర్పంచ్‌ వాసాల నరేష్‌, ఉపాధ్యాయ బృందం అభినందించారు.