TG | తెలంగాణలో జాతియ ర‌హ‌దారుల‌పై కిష‌న్ రెడ్డి కీల‌క అప్డేట్ !

  • రూ.18,772 కోట్లతో రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగం
  • రూ.6,280 కోట్లతో 285 కి.మీ జాతీయ రహదారులు
  • కొత్త ర‌హ‌దారుల‌కు త్వ‌ర‌లోనే ప్రారంభోత్సవం

తెలంగాణ అభివృద్ధి చేయడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 10 జాతీయ రహదారులను పూర్తి చేశామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణ అభివృద్దికి అన్ని విధాల కట్టుబడి ఉందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

ఈరోజు (శనివారం) హైదరాబాద్‌లోని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి, రూ.6,280 కోట్లతో 285 కి.మీ. కొత్త జాతీయ రహదారులను నిర్మించామని స్పష్టం చేశారు. ఇప్పటికే పూర్తయిన రోడ్లను త్వరలో ప్రారంభిస్తామని కిషన్ రెడ్డి ప్రకటించారు. ప్రారంభోత్సవానికి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ హాజరవుతారని ఆయన అన్నారు.

ఆర్ఆర్ఆర్ కు అంచనా వ్యయాం సిద్ధం

మరోవైపు, రేవంత్ స‌ర్కార్ ప్రతిష్టాత్మక చేపట్టిన రీజినల్ రింగ్ రోడ్ (RRR) గురించి మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించానని కిష‌న్ రెడ్డి అన్నారు. ఆర్థిక విషయంలో ఇంకా త్రిసభ్య ఒప్పందం కుదరలేదని కిషన్ రెడ్డి తెలిపారు.

ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి రూ.18,772 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారని… దీనికి సంబంధించిన అంచనా వ్యయాన్ని ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నోట్ కూడా సిద్ధమవుతోందని కిషన్ రెడ్డి తెలిపారు.

చివరి దశలో హైవేలు, ఫ్లైఓవర్లు

ఆరాంఘ‌ర్ నుండి శంషాబాద్ వరకు ఆరు లేన్ల హైవే ఇప్పటికే పూర్తయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే వారికి సిగ్నల్ ఫ్రీ రోడ్డు కూడా పూర్తయిందని ఆయన అన్నారు.

బిహెచ్‌ఇఎస్ ఫ్లైఓవర్ కూడా చివరి దశకు చేరుకుందని, వచ్చే నెలలో పూర్తవుతుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. బిహెచ్‌ఇఎల్ ఫ్లైఓవర్ పూర్తయిన తర్వాత కూకట్‌పల్లి-పటాన్‌చెరు మధ్య ట్రాఫిక్ కంట్రోల్ అవుతుందని కిషన్ రెడ్డి తెలిపారు.

కాగా, పదేళ్లలో కేంద్రం ప్ర‌భుత్వం తెలంగాణకు రూ.10 లక్షల కోట్లు ఖర్చు చేసిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి చిత్తశుద్ధి, అంకితభావంతో కృషి చేస్తూనే ఉంటుందని కిషన్ రెడ్డి మరోసారి ఉద్ఘాటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *