King-Cobra-Rescue : కింగ్ కోబ్రా బిక్కుబిక్కు Andhra Prabha Top News
King-Cobra-Rescue : కింగ్ కోబ్రా బిక్కుబిక్కు Andhra Prabha Top News
- బాత్‌రూమ్‌లో తిష్ట
- బయట జనం గజగజ
- స్నేక్ క్యాచర్ ప్రత్యక్షం
- కింగ్ కోబ్రాతో భీకర పోరాటం
- ఎట్టకేలకు ఒడిసి పట్టి అడవిలో విడుదల
( పాంటా సాహిబ్ , ఆంధ్రప్రభ )
ఇంట్లోకి పాము వచ్చిందంటేనే భయపడిపోతాం. అలాంటిది ఏకంగా కింగ్ కోబ్రా బాత్‌రూమ్‌లో తిష్ఠవేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. హిమాచల్‌ప్రదేశ్‌లోని పాంటా సాహిబ్ ప్రాంతంలోని ఓ గ్రామంలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. టాయిలెట్‌లో దాక్కున్న భారీ కింగ్ కోబ్రాను బయటకు తీసేందుకు ఓ స్నేక్ క్యాచర్ ప్రాణాలకు తెగించి చేసిన ప్రయత్నం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కర్రతో బయటకు రప్పించే ప్రయత్నం
టాయిలెట్‌లో కింగ్ కోబ్రా దాక్కున్నట్లు సమాచారం అందడంతో స్థానిక స్నేక్ క్యాచర్ భూపేందర్ సింగ్ అక్కడికి చేరుకున్నారు. అత్యంత ప్రమాదకరమైన ఆ పామును బయటకు తీసేందుకు కర్ర సాయంతో మెల్లగా దాని వైపు నెట్టడం ప్రారంభించారు.
ఇంటికి బయట పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడి ఈ రెస్క్యూ ఆపరేషన్‌ను ఆసక్తిగా గమనించారు. సమీపంలోని భవనాల పైకప్పులపైకి కూడా పలువురు చేరుకుని చూస్తూ కనిపించారు.
పడగ విప్పి.. ఒక్కసారిగా దూకుడు
భూపేందర్ సింగ్ పామును బయటకు రప్పించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో కింగ్ కోబ్రా ఒక్కసారిగా పడగ విప్పింది. వెంటనే ఆయనపైకి దూసుకొచ్చేందుకు ప్రయత్నించింది. పాము దాడికి యత్నించడంతో సింగ్ ఒక్కసారిగా వెనక్కి జరిగారు. అయినప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు. మళ్లీ టాయిలెట్ వద్దకు వెళ్లి పామును బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. చుట్టూ నిల్చున్నవారు ఉత్కంఠగా చూస్తుండగా.. కొద్దిసేపు కింగ్ కోబ్రా, స్నేక్ క్యాచర్ మధ్య తీవ్ర పోరాటమే సాగింది.
ఎట్టకేలకు పట్టేసి..
చాలాసేపటి ప్రయత్నం తర్వాత భూపేందర్ సింగ్ కింగ్ కోబ్రాలోని ఒక చివరను పట్టుకోగలిగారు. అనంతరం దాన్ని టాయిలెట్ నుంచి బయటకు లాగి రోడ్డుపైకి తీసుకొచ్చారు. అదే సమయంలో మరో వ్యక్తి అక్కడికి ఓ సంచితో చేరుకున్నాడు. ఇద్దరూ కలిసి పామును అందులోకి పంపేందుకు ప్రయత్నించారు. అయితే కింగ్ కోబ్రా ఏమాత్రం లొంగకుండా తీవ్రంగా ప్రతిఘటించింది.చివరకు ఇద్దరూ కలిసి దాన్ని సురక్షితంగా సంచిలో బంధించి అక్కడి నివాస ప్రాంతం నుంచి తరలించారు.
అడవిలోకి విడుదల
అనంతరం కింగ్ కోబ్రాను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి సురక్షితంగా అడవిలో వదిలేశారు. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రాణాలకు తెగించి కింగ్ కోబ్రాను పట్టుకున్న భూపేందర్ సింగ్ ధైర్యసాహసాలను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
