కవ్వాల ఎకో సెన్సిటివ్ జోన్ పరిధి తగ్గింపునకు ప్రతిపాదనలు
10 కిలోమీటర్ల నుంచి ఒక కిలోమీటర్‌కు తగ్గించే యోచన..
ప్రభుత్వాల ఆమోదం తర్వాతే అమలు
జన్నారం, ఆంధ్రప్రభ: కవ్వాల టైగర్ రిజర్వ్ ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిని 10 కిలోమీటర్ల నుంచి ఒక కిలోమీటర్‌కు తగ్గిస్తూ అటవీ శాఖ తరఫున ప్రతిపాదనలు పంపినట్లు జన్నారం అటవీ డివిజనల్ అధికారి ఎం. రామ్మోహన్ తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి ఆమోదం లభించిన తర్వాతే ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. జన్నారంలోని తన కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎఫ్డీఓ రామ్మోహన్ మాట్లాడారు.
కవ్వాల రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్ హైదరాబాద్ అటవీ చట్టం ప్రకారం 1941లో ఏర్పడిందని తెలిపారు. 1965లో గేమ్ రిజర్వ్‌గా, 1999లో అభయారణ్యంగా ప్రకటించారని చెప్పారు. అనంతరం వన్యప్రాణి రక్షణ చట్టం–1972, జాతీయ పులుల సంరక్షణ సంస్థ నిబంధనలకు అనుగుణంగా కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆమోదంతో 2012లో దేశంలోని 42వ టైగర్ రిజర్వ్‌గా కవ్వాలను ప్రకటించినట్లు వివరించారు.
కవ్వాల టైగర్ రిజర్వ్ మొత్తం 2,015 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉందని, ఇందులో 892 చదరపు కిలోమీటర్లు కోర్ ప్రాంతం, 1,123 చదరపు కిలోమీటర్లు బఫర్ ప్రాంతంగా ఉన్నాయని తెలిపారు. ఈ అడవులు పెద్దపులులు, టేకు వనాలకు ప్రసిద్ధి చెందాయని చెప్పారు. స్థానిక ఆదివాసీలు పెద్దపులిని ఆరాధ్య దైవంగా కొలుస్తారని పేర్కొన్నారు.
టైగర్ రిజర్వ్‌లో 75 క్షీరద జాతులు, 34 సరీసృపాల జాతులు, 10 రకాల ఉభయచరాలు, సుమారు 300 పక్షి జాతులు ఉన్నాయని తెలిపారు. 700కు పైగా టేకు, ఇతర జాతుల మొక్కలతో పాటు అనేక రకాల సీతాకోకచిలుకలు, కీటకాలకు ఈ అడవులు నిలయంగా ఉన్నాయని వివరించారు.
స్థానికులకు ఉపాధి కల్పన
కవ్వాల అటవీ ప్రాంతంలో ఎకో టూరిజం, అటవీ పనుల ద్వారా స్థానికులకు ఉపాధి లభిస్తోందని రామ్మోహన్ తెలిపారు. జన్నారం అటవీ డివిజన్ పరిధిలో 30 మంది శాశ్వత ఉద్యోగులు, 95 మంది తాత్కాలిక ఉద్యోగులు పనిచేస్తున్నారని చెప్పారు. మహారాష్ట్రలోని తడోబా తదితర టైగర్ రిజర్వ్‌లలో చేపడుతున్న కార్యక్రమాల తరహాలో ఎకో టూరిజాన్ని మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందనపల్లిలో వెదురుతో వివిధ ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఆమోదం తర్వాతే పరిధి తగ్గింపు
కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అభయారణ్యాలపై ఒత్తిడిని తగ్గించేందుకు దేశంలోని అభయారణ్యాల చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలో ఎకో సెన్సిటివ్ జోన్ అమలు చేస్తున్నట్లు ఎఫ్డీఓ తెలిపారు. ప్రస్తుతం కవ్వాల టైగర్ రిజర్వ్ చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలో ఎకో సెన్సిటివ్ జోన్ ఉందన్నారు. ఈ పరిధిని ఒక కిలోమీటర్‌కు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఏప్రిల్‌లో ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన ఆమోదాలు లభించిన తర్వాతే ప్రతిపాదన అమల్లోకి వస్తుందని ఎం. రామ్మోహన్ స్పష్టం చేశారు.
