అర్ధరాత్రి రెండు గంటలకు ఇంటి నుంచి కిడ్నాప్
మూడు కోట్లు డిమాండ్ ..
తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తప్పించుకున్న హరీష్ కుమార్
మామడ. ఆంధ్రప్రభ న్యూస్ నిర్మల్ జిల్లా (Nirmal District ) మామడ మాజీ ఎంపీపీ (Ex MPP) ఆదిలాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ డైరెక్టర్, టిఆర్ఎస్ నాయకుడు చిక్యాల హరీష్ కుమార్ (chikyal Harish ) ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ (kidnap ) చేశారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆదివారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో మామడ మండలం పొనకల్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.
ఆయన నివాసంలో నుంచి నిద్రలేపి వాహనంలో గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేసినట్లు చెబుతున్నారు. మూడు కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆగంతకులు కారులో హైదరాబాద్ వైపు తరలించారు. అదే సమయంలో హరీష్ కుమార్ తన సన్నిహితులకు ఫోన్ చేసి కొంత నగదు కావాలని కోరినట్లు కూడా చెబుతున్నారు. కిడ్నాప్ లో భాగంగా హైదరాబాద్ వైపు వెళుతున్న కారు తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద ఆగిన సమయంలో చాకచక్యంగా హరీష్ కుమార్ కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్నారు.
అక్కడినుండి నేరుగా తూప్రాన్ పోలీస్ స్టేషన్ వెళ్లి జరిగిన సంఘటన గురించి అక్కడి పోలీసులకు వివరించారు. తూప్రాన్ పోలీసులు మామడ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు చెబుతున్నారు. హరీష్ కుమార్ తెలిసిన వ్యక్తులే ఈ కిడ్నాప్ చేసినట్లు జిల్లాలో ప్రచారం జరుగుతున్నది. ప్రస్తుతం ఆయన సేఫ్ గా ఉన్నారు. తమకు సమాచారం ఉందని విచారణ జరుపుతున్నామని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని మామడ ఎస్సై అశోక్ తెలిపారు.
కాగా ఈ ఘటన నిర్మల్ జిల్లాలో తీవ్ర కలకలం రేపుతున్నది. కిడ్నాప్ జరిగిన మాట నిజమేనని తాను ప్రస్తుతం సేఫ్ గా ఉన్నానని ఎవరు ఆందోళన చెందే అవసరం లేదని హరీష్ కుమార్ తమ సన్నిహితులకు ఫోన్ చేసి చెప్పారు