Khammam | ఫామ్ హౌజ్‌లో ప‌డుకునే ప్ర‌భుత్వం కాదు మాది – మంత్రి పొంగులేటి

బీఆర్ఎస్ నేత‌ల‌పై మంత్రి పొంగులేటి ఫైర్
ఇందిర‌మ్మ ప్ర‌భుత్వంలో పేద‌ల‌కు మేలు

ఖమ్మం, ఆంధ్ర‌ప్ర‌భ :
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలా మాది ఫామ్‎హౌస్‎లో పడుకునే ప్రభుత్వం కాదని.. ప్రజా ప్రభుత్వమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా వైరా మండల పరిధిలోని పుణ్యపురం గ్రామంలో నేడు జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న ఇందిరమ్మ ఇళ్ల శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం.. ఇందిరమ్మ ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వమన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.

ప‌దేళ్లు వాళ్లు మాయ‌మాట‌లే చెప్పారు..

బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసిందని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ చేసిన ఏడు లక్షల కోట్ల అప్పులకు వడ్డీలు చెల్లిస్తూ.. అప్పులు తీరుస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళుతున్నామన్నారు. 56 నియోజకవర్గాలలో రెండు కోట్ల రూపాయల ఖర్చుతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా రైతు భరోసా, రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వమన్నారు. ప్రతిపక్ష నాయకులు అధికార పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత రెవెన్యూ, పోలీస్ యంత్రాంగంపై ఉందని చెప్పారు. ఇసుక తరలింపుపై అభ్యంతరాలు పెట్టి లబ్ధిదారులను ఇబ్బంది పెట్టొద్దని అధికారులకు సూచించారు. 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఇళ్లు కూడా నిర్మాణం చేయలేదని.. ఎక్కడ చూసినా మొండి గోడలు, అసంపూర్తి నిర్మాణాలేనని విమర్శించారు. కానీ ఇందిరమ్మ రాజ్యంలో అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే నాలుగు లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని గర్వంగా చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *