పన్నుల వసూళ్లకు పక్కా కార్యాచరణ

  • వార్డు ఆఫీసర్లకు వ్యక్తిగత లక్ష్యాలు..
  • రోజుకు 50 ఇళ్ల సందర్శన తప్పనిసరి

ఖమ్మం,ఆంధ్రప్రభ: ఖమ్మం నగరపాలక సంస్థ ఆదాయాన్ని పెంచడంతో పాటు పన్నుల వసూళ్లను వేగవంతం చేసేందుకు రెవెన్యూ విభాగం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా ప్రతి వార్డు ఆఫీసర్‌కు వ్యక్తిగత లక్ష్యాలను నిర్దేశించారు. రోజుకు కనీసం 50 ఇళ్లను సందర్శించి, 10 నుంచి 20 ఇళ్లలో ఆస్తి పన్ను వసూలు చేయాలని రెవెన్యూ ఆఫీసర్ వెంకటలక్ష్మీ ఆదేశించారు.

బుధవారం వార్డు ఆఫీసర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో రెవెన్యూ వసూళ్ల పురోగతిని ఆమె పరిశీలించారు. నగరపాలక సంస్థకు ప్రధాన ఆదాయ వనరైన ఆస్తి పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పన్ను చెల్లింపుదారులను నేరుగా కలవాలని స్పష్టం చేశారు.

ఆస్తి పన్నుతో పాటు నీటి పన్ను వసూళ్లను కూడా వేగవంతం చేయాలని వెంకటలక్ష్మీ సూచించారు. దీర్ఘకాలంగా పన్నులు చెల్లించని వారిని గుర్తించి, వారికి అవగాహన కల్పిస్తూ బకాయిలు వసూలు చేయాలని ఆదేశించారు. ప్రతి వార్డులో వసూళ్ల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు.

వార్డుల పరిధిలోని వాణిజ్య దుకాణాలను సందర్శించి ట్రేడ్ లైసెన్సుల పరిస్థితిని పరిశీలించాలని ఆదేశించారు. లైసెన్సులు లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్న దుకాణాలను గుర్తించి, మున్సిపల్ నిబంధనల ప్రకారం కొత్త లైసెన్సులు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రతి వార్డు ఆఫీసర్ రోజువారీగా ఇళ్ల సందర్శనలు, పన్నుల వసూళ్లు, ట్రేడ్ లైసెన్సుల జారీ వివరాలను నమోదు చేయాలని రెవెన్యూ ఆఫీసర్ స్పష్టం చేశారు. నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత సమయంలో సాధించేలా పనిచేయాలని సూచించారు. నగరంలో అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చడంలో పన్నుల వసూళ్లు కీలకమని, అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి నగరపాలక సంస్థ ఆదాయాన్ని పెంచాలని వెంకటలక్ష్మీ పేర్కొన్నారు.