ఓటర్లకు అలర్ట్.. సెప్టెంబర్ 5, 6న ప్రత్యేక శిబిరాలు..
హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణలో ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాను ఆగస్టు 17న ప్రచురించినట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం తెలిపింది. ఆయా ఎన్నికల నమోదు అధికారుల కార్యాలయాల్లో జాబితాను అందుబాటులో ఉంచడంతో పాటు.. ఎఎస్‌డీడీ ఓటర్ల వివరాలను కూడా ముఖ్య ఎన్నికల అధికారి వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు వెల్లడించింది. ఓటర్లు తమ పేర్లు, ఇతర వివరాలను పరిశీలించుకుని తప్పులు ఉంటే సరిదిద్దుకోవాలని సూచించింది.
ముసాయిదా ఓటర్ల జాబితాపై క్లెయిమ్‌లు, అభ్యంతరాలు దాఖలు చేసేందుకు సెప్టెంబర్ 16 వరకు గడువు ఉంది. అందిన క్లెయిమ్‌లు, అభ్యంతరాలపై విచారణ జరిపి పరిష్కరించేందుకు అక్టోబర్ 15 వరకు సమయం ఉంది. ఓటర్ల జాబితాలో పేర్లు లేకపోవడం, వివరాల్లో తప్పులు ఉండటం, మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నవారు ఈ గడువులోగా సంబంధిత అధికారులను సంప్రదించవచ్చు.
ఓటర్లకు నేరుగా సేవలు అందించేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను రెండు విడతల్లో నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 5, 6 తేదీల్లో తొలి విడత, సెప్టెంబర్ 12, 13 తేదీల్లో రెండో విడత ప్రత్యేక ప్రచారం చేపట్టనున్నారు. ఈ నాలుగు రోజుల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో బూత్ స్థాయి అధికారులు, బూత్ స్థాయి ఏజెంట్లు అందుబాటులో ఉంటారు. ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వెళ్లి తమ పేర్లు, వివరాలను పరిశీలించుకోవడంతో పాటు అవసరమైన దరఖాస్తులను సమర్పించవచ్చు.
కొత్త ఓటర్ల నమోదుకు ఫారం-6, ఓటరు జాబితాలోని పేరుపై అభ్యంతరం లేదా తొలగింపునకు ఫారం-7, పేరు, చిరునామా, ఇతర వివరాల సవరణకు ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ప్రవాస భారతీయుల కోసం ఫారం-6ఏ ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 92,88,112 నోటీసులు రూపొందించగా.. వాటిలో 31,74,952 నోటీసులు అందినట్లు అధికారులు తెలిపారు. అందిన నోటీసుల్లో 1,94,737 నోటీసులపై ఇప్పటికే విచారణ పూర్తయింది. మిగిలిన నోటీసులపై నిర్ణీత గడువులోగా విచారణ పూర్తి చేసేందుకు 119 మంది ఎన్నికల నమోదు అధికారులు, 1,973 మంది సహాయ ఎన్నికల నమోదు అధికారులు పనిచేయనున్నారు.
మరోవైపు ముసాయిదా జాబితాపై ఇప్పటివరకు 9,07,292 క్లెయిమ్‌లు, అభ్యంతరాలు అందాయి. వీటిలో కొత్త ఓటర్ల నమోదుకు సంబంధించి ఫారం-6 ద్వారా 3,94,517 దరఖాస్తులు వచ్చాయి. ప్రవాస భారతీయుల కోసం ఫారం-6ఏ ద్వారా 6,346 దరఖాస్తులు అందాయి. ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపునకు సంబంధించి ఫారం-7 ద్వారా 48,752 దరఖాస్తులు నమోదయ్యాయి.
ఓటర్ల వివరాల్లో మార్పులు, సవరణలకు సంబంధించి ఫారం-8 ద్వారా అత్యధికంగా 4,57,677 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. పేరు, చిరునామా లేదా ఇతర వివరాల్లో తప్పులు ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ప్రత్యేక ప్రచార రోజుల్లో పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటర్ల జాబితాలో తమ వివరాలను తప్పనిసరిగా పరిశీలించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
