గంజాయి కేసులో పరారీలో ఉన్న నిందితుడి అరెస్ట్‌

భద్రాచలం నుంచి 2.400 కిలోల ఎండు గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తరలింపు

కేసముద్రం సీఐ సత్యనారాయణ, ఎస్సై కరుణాకర్‌

కేసముద్రం, ఆంధ్రప్రభ : గంజాయి అక్రమ రవాణా, మత్తు పదార్థాల వినియోగం, విక్రయాల నియంత్రణకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటున్నట్లు కేసముద్రం సీఐ సత్యనారాయణ, ఎస్సై కరుణాకర్‌ తెలిపారు. ఈ క్రమంలో నెల్లికుదురు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నమోదైన కేసులో గతంలో పోలీసుల తనిఖీల సమయంలో తప్పించుకుని పరారీలో ఉన్న మహబూబ్‌నగర్‌ పట్టణం హనుమాన్‌పురకు చెందిన కాపుగేరీ రాజు అలియాస్‌ ఎఫ్‌ ఏజ్‌ను మంగళవారం పోలీసులు పట్టుకుని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ వివరించారు.

విచారణలో నిందితుడు తన సహచరులతో కలిసి భద్రాచలం ప్రాంతం నుంచి సుమారు 2.400 కిలోల ఎండు గంజాయిని కొనుగోలు చేసి, హైదరాబాద్‌లో అధిక ధరకు విక్రయించాలనే ఉద్దేశంతో తీసుకెళ్తున్నట్లు వెల్లడైందన్నారు. ఈ కేసుకు సంబంధించి నిందితుడి వద్ద నుంచి ఆపిల్‌ కంపెనీ మొబైల్‌ ఫోన్‌ను పంచుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసులో తదుపరి విచారణ కొనసాగుతోందని పేర్కొన్నారు.

గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సీఐ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.