Kerala Lottery | ప్ర‌జ‌లు మోసపోవద్దు

Kerala Lottery | ప్ర‌జ‌లు మోసపోవద్దు

  • కేరళ లాటరీ అక్రమ విక్రయాలపై పోలీసుల ఉక్కుపాదం
  • చిత్తూరులో ఐదుగురు అరెస్టు
  • రూ.22 వేల నగదు స్వాధీనం

Kerala Lottery | చిత్తూరు, ఆంధ్ర‌ప్ర‌భ : చిత్తూరు పట్టణంలో అక్రమంగా కేరళ లాటరీ ఆన్‌లైన్ టికెట్లు విక్రయిస్తున్న ముఠాపై చిత్తూరు పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు, చిత్తూరు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి టి. సాయినాథ్ పర్యవేక్షణలో, చిత్తూరు- 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్ట‌ర్ మహేశ్వర నేతృత్వంలో శుక్రవారం రాత్రి ప్రత్యేక దాడులు నిర్వహించి ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ దాడుల్లో వారి వద్ద నుంచి రూ.22,000 నగదును స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల కథనం ప్రకారం, చిత్తూరు పట్టణంలోని దుర్గా హోటల్ సమీపంలో, ఎమ్మెస్సార్ జంక్షన్ వద్ద ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ ప్రాంతంలో అక్రమంగా లాటరీ టికెట్లు విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా లాటరీ టికెట్లు విక్రయిస్తున్న జి. కిరణ్, ఎం.ముత్తు, ఎస్.శంకర్, టి.వెంకటేష్, షేక్ బాషా అనే ఐదుగురిని పోలీసులు పట్టుకున్నారు. వీరిపై చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసులు నమోదు చేశారు.

పట్టుబడిన వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిషేధించబడిన కేరళ లాటరీ టికెట్లను చిత్తూరు పట్టణం, పరిసర ప్రాంతాల్లో ఎక్కువ ధరలకు విక్రయిస్తూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. క్రైమ్ నెంబర్ 161/2025 కింద జి. కిరణ్ కుమార్ (30), ఎం. ముత్తు (30), ఎస్. శంకర్ (40)లను అరెస్టు చేయగా, యువరాజ్ అనే మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. అలాగే క్రైమ్ నెంబర్ 162/2025 కింద టి. వెంకటేష్ (59), షేక్ బాషా (57)లను అరెస్టు చేయగా, భాస్కర్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు.

ఈ దాడుల్లో ఇన్స్పెక్టర్ మహేశ్వరతో పాటు ఏఎస్ఐ బాబు, మధు, హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్, వాసు, కానిస్టేబుల్స్ బాలాజీ, హాజీ, జనార్ధన్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. లాటరీ టికెట్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. నిషేధిత లాటరీ టికెట్లు కొనుగోలు చేసి మోసపోవద్దని, ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందితే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. అక్రమ లాటరీ విక్రయాలపై నిఘా కొనసాగుతుందని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు.

Leave a Reply