కేసీఆర్ హయాంలోనే గిరిజనులకు న్యాయం
గిరిజనుల హక్కులు, సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది..
బీఆర్‌ఎస్ నాయకులు
తొర్రూరు, ఆంధ్రప్రభ : కేసీఆర్ హయాంలోనే గిరిజనులకు సంపూర్ణ న్యాయం జరిగిందని బీఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు ధరావత్ జైసింగ్, మాలోతు కాలు నాయక్ అన్నారు. డివిజన్ కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఎస్టీ సెల్ మండల ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో గిరిపుత్రుల జీవితాల్లో వెలుగులు నిండాయని తెలిపారు. 3,146 తండాలు, గూడేలను గ్రామపంచాయతీలుగా మార్చడంతో గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక పరిపాలనా గుర్తింపు లభించిందన్నారు.
కేసీఆర్ హయాంలో హక్కులు, ఆత్మగౌరవం, భూమి, రిజర్వేషన్లు, విద్య, ఉపాధి, స్వయం పాలనకు ప్రాధాన్యం లభించిందని వారు పేర్కొన్నారు. గిరిజనుల జీవితాల్లో కొత్త వెలుగులు నిండితే.. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో గిరిజన సంక్షేమం నిర్వీర్యమవుతోందని ఆరోపించారు. గిరిజనుల హక్కులు, సంక్షేమం, అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. మేడారం జాతర, సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి, నాగోబా జాతర, కుమ్రం భీం జయంతి, గాంధారి మైసమ్మ తదితర గిరిజన పండుగలకు అధికారిక గుర్తింపు, మద్దతు కల్పించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని తెలిపారు.
గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపిన అభివృద్ధి ప్రదాత కేసీఆర్ అని తండాలు, గూడేల్లోని ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారని నాయకులు పేర్కొన్నారు. సెప్టెంబరు 17న గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ అమలు కోసం కేసీఆర్ ప్రకటన చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదేశాల మేరకు మండలంలో సంబురాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ ధరావత్ పద్మకిషన్ నాయక్, మాజీ కౌన్సిలర్ గుగులోతు శంకర్, నాయకులు జాటోత్ స్వామి నాయక్, జాటోత్ టీకు నాయక్, జాటోత్ రమేష్, హపావత్ సురేష్, సోమ్లా నాయక్, గుగులోతు రమేష్, బానోత్ రాజ్‌కుమార్, భూక్యా బాసు, గుగులోతు బిచ్చు, జాటోత్ కిషన్, మాలోత్ హుస్సేన్, నవీన్, అనిల్, సుందర్ తదితరులు పాల్గొన్నారు.
