KCR | అర్రాస్ పాటలు పాడి.. శఠగోపం పెట్టారు..

  • కాంగ్రెస్ పై కేసీఆర్ ఫైర్

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల ముందు పచ్చి అబద్ధాలు, మాయమాటలతో ప్రజలను నమ్మించి, ఇప్పుడు తీరా అధికారంలోకి వచ్చాక అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ‘శఠగోపం’ పెట్టిందని మండిపడ్డారు.

అర్రాస్ పాటలు పాడినట్లుగా.. కేసీఆర్ రూ.10 వేలు ఇస్తే మేం రూ.15 వేలు ఇస్తాం, తులం బంగారం ఇస్తాం, రూ.4 వేల పెన్షన్ ఇస్తాం అని నమ్మబలికారు. రుణమాఫీ అని నరికిండ్రు.. ప్రజలను టెంప్ట్ చేసి ఓట్లు వేయించుకున్నారు. వంద రోజుల్లోనే అన్నీ ఇస్తామని ఇంటింటికీ గ్యారెంటీ కార్డులు పంచారు కానీ, ఇప్పుడు దేనికీ దిక్కులేదు అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రెండు సార్లు రైతుబంధు ఎగ్గొట్టారని, రెండు నెలల పెన్షన్లు కూడా ఎగ్గొట్టి ప్రజలను భయంకరమైన పరిస్థితుల్లోకి నెట్టారని ధ్వజమెత్తారు.
కేసీఆర్ రెండు అంటే వీడు నాలుగు అంటున్నాడు కదా అని ఆశపడి ఓటు వేశారు.. ఇప్పుడు ప్రజలు తలలు బాదుకుంటున్నారని కేసీఆర్ అన్నారు.

మళ్ళీ మొదలైన ‘చెప్పుల క్యూ’ లైన్లు…

రైతుల పరిస్థితిపై కేసీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మా ప్రభుత్వంలో యూరియా కోసం రైతులు ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. ఆటో వాడికి పైసలిస్తే పొలం దగ్గర బస్తాలు పడేసి వెళ్లేవాడు. కానీ ఇప్పుడు యూరియా కోసం రైతులు రోజుల తరబడి చెప్పులు క్యూలో పెట్టి ఎదురుచూస్తున్నారు. బీఆర్‌ఎస్ రాకముందున్న ఆ పాత ‘చెప్పుల లైన్లు’ కాంగ్రెస్ రాగానే మళ్ళీ మొదలయ్యాయి అని విమర్శించారు.
ఎరువుల కోసం యాప్ తెచ్చి రైతులను మరిన్ని కష్టాల్లోకి నెట్టారని, ఎకరం భూమి ఉన్న రైతు మూడు సార్లు లైన్లో నిలబడాలా? అని ప్రశ్నించారు.

మేము భూముల ధరలు పెంచి ప్రజల ఆస్తిని పెంచితే, ఈ ప్రభుత్వం వచ్చాక ధరలు ‘ఢమాల్’ అని పడిపోయాయి. కూతురి పెళ్లి కోసం తక్కువ ధరకే భూమిని అమ్ముకోవాల్సిన దుస్థితికి రైతులను తెచ్చారు అని కేసీఆర్ మండిపడ్డారు. కేసీఆర్ చేసిన అప్పుల వల్ల వడ్డీలు కట్టలేకపోతున్నానని రేవంత్ రెడ్డి సాకులు చెబుతున్నాడని, కానీ కాగ్ (CAG) ఇప్పటికే ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిందని గుర్తు చేశారు. “పొద్దున లేస్తే కేసీఆర్ చచ్చిపోవాలి అని శాపాలు పెడుతున్నారు.. ఇంత అక్కసు ఎందుకు? రియాలిటీ వేరు, మీరు చెబుతున్నది వేరు.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు అని కాంగ్రెస్ సర్కార్‌ను కేసీఆర్ కడిగిపారేశారు.

Leave a Reply