సీఎం రేవంత్‌కు కవిత వార్నింగ్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణలో ఇంటర్మీడియట్‌ విద్యా వ్యవస్థను రద్దు చేయడం లేదా ప్రస్తుత విధానంలో మార్పులు చేయడం వంటి ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకిస్తామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. సమర్థవంతంగా కొనసాగుతున్న ఇంటర్‌ విద్యా వ్యవస్థ జోలికి వెళ్లాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఇంటర్మీడియట్‌ విద్యను తొలగించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు.

హైదరాబాద్‌లోని నాంపల్లి తెలంగాణ మీడియా అకాడమీలో శుక్రవారం ఇంటర్‌ విద్యా జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సేవ్‌ ఇంటర్‌ ఎడ్యుకేషన్‌ జంగ్‌ సైరన్‌’ సమావేశంలో కవిత పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ విద్యా వ్యవస్థ భవిష్యత్తుపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో ఆమె ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎంతోమంది విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దిన ఇంటర్‌ విద్యా వ్యవస్థను బలహీనపరిచే ఎలాంటి నిర్ణయాన్నైనా వ్యతిరేకిస్తామని ప్రకటించారు.

‘దేశానికే ఆదర్శం.. విజయాలకు చిరునామా’

తెలంగాణలో అమలవుతున్న ఇంటర్మీడియట్‌ విద్యా వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిందని కవిత పేర్కొన్నారు. ఎంతోమంది విద్యార్థుల విజయాలకు ఈ వ్యవస్థ చిరునామాగా మారిందన్నారు. అలాంటి వ్యవస్థను రద్దు చేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రస్తుతం ఇంటర్‌ విద్య సమర్థవంతంగా కొనసాగుతున్నప్పుడు దానిని తొలగించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు.

‘సమస్యే లేనప్పుడు పరిష్కారం ఎందుకు?’

‘‘సమస్య లేనప్పుడు దానిని పరిష్కరించాల్సిన అవసరం ఏముంది? ఇంటర్మీడియట్‌ విద్య మన విద్యార్థుల జీవితాలను మలుపుతిప్పిన అద్భుతమైన వ్యవస్థ. దానిని రద్దు చేయాలనే ఆలోచనను నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను’’ అని కవిత పేర్కొన్నారు. ఇంటర్‌ విద్యా వ్యవస్థ ఎంతో బలంగా ఉందని, దాని జోలికి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం ఏవైనా సంస్కరణలు చేపట్టాలనుకుంటే విద్యార్థులు, అధ్యాపకులు, విద్యారంగ నిపుణులతో విస్తృతంగా చర్చించిన తర్వాతే ముందుకు వెళ్లాలని సూచించారు.

‘సీఎం మాటలకు.. శాఖల ప్రకటనలకు పొంతనేదీ?’

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేస్తున్న ప్రకటనలకు, ప్రభుత్వ శాఖల నుంచి వస్తున్న ప్రకటనలకు మధ్య పొంతన ఉండటం లేదని కవిత విమర్శించారు. ఒకవైపు ఇంటర్మీడియట్‌ ప్రవేశాలకు సంబంధించి ఒక విధమైన ప్రకటన వస్తుంటే, మరోవైపు ఇంటర్మీడియట్‌ బోర్డు నుంచి ప్రవేశాలకు సంబంధించిన ప్రకటనలు వస్తున్నాయని అన్నారు. దీనివల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకుల్లో గందరగోళం ఏర్పడుతోందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం ప్రకటనలు చూస్తుంటే ‘‘తుగ్లక్‌ కూడా సిగ్గుపడతారు’’ అంటూ విమర్శించారు. ఇంటర్మీడియట్‌ విద్యను తొలగించాలని ఆలోచించడమే సరికాదని పేర్కొంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన అంశాల్లో ప్రభుత్వం ప్రయోగాలకు వెళ్లకూడదని హితవు పలికారు.

‘అసెంబ్లీలోనే స్పష్టత ఇవ్వాలి’

ఇంటర్మీడియట్‌ విద్యా వ్యవస్థ భవిష్యత్తుపై విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకుల్లో నెలకొన్న అనుమానాలకు ప్రభుత్వం ముగింపు పలకాలని కవిత డిమాండ్‌ చేశారు. ఇంటర్‌ విద్యను తొలగించే ఆలోచన లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా స్పష్టంగా ప్రకటించాలని కోరారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు ఇంటర్‌ విద్య పరిరక్షణ కోసం జరిగే పోరాటానికి తమ మద్దతు ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.