ఆడబిడ్డల పెళ్లికి హామీ..

మాట నిలబెట్టుకున్న సర్పంచ్‌ కాటం

ఇద్దరు ఆడబిడ్డల వివాహానికి రూ.10,116 చొప్పున వివాహ కానుక

చిట్యాల, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ ఎన్నికల సమయంలో పెద్ద కాపర్తి గ్రామ సర్పంచిగా కాటం వెంకటేశంను గెలిపిస్తే ప్రతి ఆడబిడ్డ పెళ్లికి ఆర్థిక సహాయం అందిస్తానని ఓర్సు రాజు, ఎమ్మెల్యే వేముల వీరేశం సమక్షంలో హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు బుధవారం పెద్ద కాపర్తి గ్రామానికి చెందిన శిరసు ముత్యాలు, గుండెపూరి బిక్షం, శిరసు ఇద్దయ్యల కుమార్తెల వివాహాల సందర్భంగా ఆర్థిక సహాయం అందించారు. దేవస్థానం చైర్మన్‌ ఓర్సు రాజు పంపిన రూ.10,116 చొప్పున వివాహ కానుకలను సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కాటం వెంకటేశం వివాహ పెద్దలకు అందజేశారు.

ఇచ్చిన మాట ప్రకారం ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక సహాయం అందించినందుకు గ్రామ ప్రజలు సర్పంచ్‌ కాటం వెంకటేశం, ఓర్సు రాజుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ ఓర్సు సైదులు, ఏర్పుల నరసింహ, కురు యాదయ్య, ఆనగంటి నరేష్‌, సాగర్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.