వైభవంగా కార్తీకదీపోత్సవం
కిటకిటలాడిన ఆలయాలు
మక్తల్, (ఆంధ్రప్రభ) : కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం కార్తీకదీపోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా శివాలయాలు, వైష్ణవాలయాలు కార్తీకదీపోత్సవ వేడుకలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. మక్తల్ పట్టణంలోని అత్యంత ప్రాచీనమైన శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో అదే విధంగా శ్రీ ఉమామహేశ్వరాలయం, శ్రీ నగరేశ్వర స్వామి దేవాలయం, శ్రీ కుంబేశ్వరాలయం ,శ్రీ ఆత్మ లింగేశ్వరాలయం తో పాటు పలు శివాలయాల్లో తెల్లవారుజామున 4 గంటల నుంచి మహారుద్రాభిషేకాలు, అభిషేకాలు, విశేష పూజలు కొనసాగాయి. మహిళలు దంపతులు కుటుంబ సభ్యులు కలిసిన వచ్చి ఆలయాల వద్ద కార్తిక దీపాలను వెలిగించి స్వామివారికి నైవేద్యాలు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు.
అదే విధంగా పట్టణంలోని శ్రీ పడమటి ఆంజనేయస్వామి దేవాలయంలో పెద్ద ఎత్తున భక్తులతో కార్తిక దీపాలు వెలిగించారు. మండల పరిధిలోని పసుపుల వద్ద వెలసిన శ్రీ పాద శ్రీ వల్లభాపురం దత్తక్షేత్రం వద్ద కృష్ణా నదిలో భక్తులు పవిత్ర నది స్నానం ఆచరించి దత్తక్షేత్రంలో కార్తీక దీపాలను వెలిగించారు. శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆలయ వంశపారంపర్య ధర్మకర్త పి. ప్రాణేశాచారి శ్రీ ఉమామహేశ్వరాలయంలో అర్చకులు సిద్ధరామయ్య స్వామి శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో అర్చకులు వేద పండిత తిప్పయ్య స్వామి ఆధ్వర్యంలో అభిషేకాలు కొనసాగాయి.

