Kangana Ranaut | అశ్లీల కంటెంట్‌పై కోర్టుకెక్కిన బాలీవుడ్ క్వీన్!
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: హీరోయిన్ల ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడం.. ఏఐ మరింత సులభంగా మారిపోయింది. ఈ క్రమంలో సెలబ్రిటీల వ్యక్తిత్వ హక్కుల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. తాజాగా బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ ఈ వ్యవహారంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఈ విషయంపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు సంబంధించిన కొన్ని ఏఐ రూపొందించిన అశ్లీల, అభ్యంతరకర కంటెంట్‌ను ఇంటర్నెట్ నుంచి తొలగించాలని ఆమె కోర్టును కోరారు. ఈ కంటెంట్ తన పరువుకు భంగం కలిగించడంతో పాటు.. తన వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘిస్తోందని ఆమె తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
‘మీమ్స్‌పై ఇప్పుడే చర్యలు వద్దు’
అయితే కంగనా తరఫు న్యాయవాది కీలక విషయాన్ని స్పష్టం చేశారు. తన క్లయింట్‌కు సంబంధించిన ప్రతి మీమ్, వ్యంగ్య పోస్టుపై చర్యలు కోరడం లేదని తెలిపారు. ప్రస్తుతం అశ్లీలమైన, నకిలీగా రూపొందించిన కంటెంట్‌పైనే న్యాయపరమైన రక్షణ కోరుతున్నామని వివరించారు. సోషల్ మీడియాలో తనపై వచ్చే మీమ్స్, వ్యంగ్య కంటెంట్ కూడా ఉన్నప్పటికీ.. వాటిపై ఈ దశలో ఉపశమనం కోరడం లేదని కోర్టుకు తెలిపారు.
కంగనా దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వికాస్ మహాజన్.. ప్రతివాదులకు సమన్లు జారీ చేశారు. ఈ వ్యవహారంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు కోర్టు తెలిపింది.
ఇప్పటికే బాలీవుడ్ నటులు ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, సల్మాన్ ఖాన్ తదితరులు తమ వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసం కోర్టును ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కల్యాణ్ కూడా ఇదే అంశంపై న్యాయపరమైన రక్షణ కోరారు. అలాగే ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్, పాడ్‌కాస్టర్ రాజ్ షమానీ, క్రికెటర్ అభిషేక్ శర్మ తదితరులు కూడా తమ వ్యక్తిత్వ హక్కులను కాపాడుకునేందుకు కోర్టును ఆశ్రయించిన వారిలో ఉన్నారు.
