కనకదుర్గమ్మ కు కాసుల వర్షం..
దసరా ఉత్సవాల్లో భక్తుల కానుకలు..
హుండీ ఆదాయం రూ.11.59 కోట్లు
మూడు విడతల్లో హుండీల లెక్కింపు పూర్తి
మూడు రోజుల లెక్కింపులో రూ.11,59,32,304 ఆదాయం
496 గ్రాముల బంగారం.. 13.850 కిలోల వెండి
విదేశీ కరెన్సీ సమర్పించిన భక్తులు..
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు, భవానీ దీక్షల విరమణ సందర్భంగా భక్తులు అమ్మవారికి భారీగా కానుకలు సమర్పించారు. ఆలయ ప్రాంగణంలోని మహామండపం ఆరో అంతస్తులో నిర్వహించిన హుండీల లెక్కింపులో మూడు విడతలకు కలిపి రూ.11.59 కోట్లకు పైగా నగదు ఆదాయం సమకూరింది. బంగారం, వెండి, విదేశీ కరెన్సీ రూపంలోనూ భక్తులు కానుకలు సమర్పించారు.
అక్టోబరు 26, 27 తేదీలతో పాటు నవంబరు 2న నిర్వహించిన హుండీల లెక్కింపులో మొత్తం రూ.11,59,32,304 నగదు లభించింది. ఇందులో భారతీయ కరెన్సీ నోట్ల రూపంలో రూ.10,94,36,304, నాణేల రూపంలో రూ.64,96,000 సమకూరాయి. మూడు విడతల్లో కలిపి 496 గ్రాముల బంగారం, 13 కిలోల 850 గ్రాముల వెండి లభించాయి. తొలి విడతలో 140 గ్రాముల బంగారం, 4 కిలోల 360 గ్రాముల వెండి, రెండో విడతలో 241 గ్రాముల బంగారం, 5 కిలోల 900 గ్రాముల వెండి, మూడో విడతలో 115 గ్రాముల బంగారం, 3 కిలోల 590 గ్రాముల వెండి సమర్పించారు. భక్తులు వివిధ దేశాలకు చెందిన కరెన్సీని కూడా హుండీల్లో వేశారు.
అమెరికా డాలర్లు 397, న్యూజిలాండ్ డాలర్లు 500, యూఏఈ దిర్హామ్‌లు 160, యూరోలు 45, బ్రిటన్ పౌండ్లు 65తో పాటు ఇతర దేశాల కరెన్సీ లభించింది. మొత్తం 16 దేశాలకు చెందిన విదేశీ కరెన్సీని లెక్కించారు. హుండీల్లో పాత రూ.2 వేల నోట్లు 17 లభించయి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలతో పాటు భవానీ దీక్షల విరమణకు వచ్చిన భక్తులు వివిధ రూపాల్లో అమ్మవారికి కానుకలు సమర్పించారు. ఆలయ అధికారుల పర్యవేక్షణలో సిబ్బంది, ఎస్పీఎఫ్, స్థానిక పోలీసుల సహకారంతో హుండీల లెక్కింపు ప్రక్రియను నిర్వహించారు. లెక్కించిన నగదు, బంగారం, వెండి, విదేశీ కరెన్సీ వివరాలను దేవస్థానం అధికారులు నమోదు చేశారు.
