Kanaka-Durga-No-Publicity-Dasara-Festival దసరా కళ కలే ! ? Andhr Prabha Exclusive Story
Kanaka-Durga-No-Publicity-Dasara-Festival దసరా కళ కలే ! ? Andhr Prabha Exclusive Story
- మరో పది రోజుల్లో ఉత్సవాలు
- దుర్గమ్మ శరన్నవరాత్రి వేడుకలు
- అయినా కానరాని ప్రచారం…
- పోస్టర్లు, పాంప్లెట్స్ అడగొద్దు
- ప్రచార మాధ్యమాల్లోనూ మాయం…
- ఉత్సవాల తేదీ, అలంకారాలపై సమాచారం శూన్యం..
- టికెట్ ధరలు, ఉభయదాతల పూజలపై ప్రకటనలు ఎక్కడ?
- పేరుకే ఏటేటా ఉత్సవాలకు భారీ వ్యయం
- ప్రచారానికి రూపాయి విదల్చని వైనం…
( ఇంద్రకీలాద్రి , ఆంధ్రప్రభ)
ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ దసరా మహోత్సవాలు ఈనెల 11 నుంచి 20 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం ఏర్పాట్లుచేస్తోంది. కోట్ల రూపాయల వ్యయంతో పనులు చేపట్టామని ప్రకటనలు గుప్పించే అధికారులు మాత్రం అమ్మవారి ఉత్సవ తేదీలు, అలంకారాలు, తెప్పోత్సవం, ఇతర వివరాలపై ప్రచారం చేయడం మాత్రం మరిచిపోయారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా అట్టహాసంగా నిర్వహించే ఈ ఉత్సవాలకు సంబంధించిన ముందస్తు ప్రచారం లేకపోవడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
… ప్రచారం చేసేది ఎప్పుడు….

సాధారణంగా నెల రోజులు ముందుగానే ఉత్సవ తేదీలు, అలంకారాలపై ఆలయ వైదిక కమిటీ దేవస్థానానికి తెలియజేస్తోంది. గతంలో అలంకారాల పూర్తి వివరాలతో కూడిన కరపత్రాలు దేవస్థానం రిసెప్పన్‌తో పాటు పలు ప్రాంతాల్లో అందుబాటులో ఉంచేవారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు వీటిని తీసుకొని ఉత్సవ తేదీలకనుగుణంగా వారి ప్రయాణాలను చేసుకొనేందుకు రైలు, బస్సు రిజర్వేషన్లు చేసుకునేవారు. అయితే గత కొన్నాళ్లుగా ఈవిధమైన కరపత్రాలకు దేవస్థానం దూరంగా ఉంది. సాధారణంగా రాష్ట్రంలోని వివిధ ప్రధాన దేవాలయాలకు కూడా ఆలయ ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలు, వాల్ పోస్టర్లను పంపడం ఆనవాయితీగా వస్తోంది. ఆయా ఆలయ పరిసరాల్లో ఆ వాల్ పోస్టర్లను అతికించడం ద్వారా దసరా ఉత్సవాల తేదీలపై అవగాహన కల్పించేవారు. అయితే ప్రతి ఏటా ఉత్సవాల పేరుతో అనవసర వ్యయానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ అవసరమయ్యే ప్రచారంపై చిన్న చూపు చూస్తున్నారు. దీంతో దూర ప్రాంత భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
…కాణిపాకంలో నేటికీ పోస్టర్లతో ప్రచారం…

రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయమైన కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో ఇటీవల వినాయకచవితి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి . ఈ వేడుకలకు సంబంధించిన పూర్తి వివరాలతో ఆ గ్రామ పరిసరాలతోపాటు ఇతర దేవస్థానాలకు వాల్ పోస్టర్లను ఆలయ అధికారులు పంపారు. చక్కనైన స్వామి వారి ఫొటోతో పాటు ఉత్సవ తేదీలు, పూజలపై పూర్తివివరాలు ముద్రించడంతో భక్తులు వాటిని చూసి ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం ఏర్పడింది. అలాగే మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి, నెమలి వేణుగోపాలస్వామి ఇలా ఏ ఆలయమైనా ఇప్పటికీ ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నా దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం అధికారులు మాత్రం ఆ నిబంధనలకు తిలోదకాలు ఇచ్చేశారు.
…కరపత్రాలు ఎక్కడ?
ఒక్కో రోజు ఒక్కో అలంకారంతో దర్శనమిచ్చే అమ్మవారి అలంకార వివరాలతో కూడిన కరపత్రాలు కూడా దేవస్థానం ముద్రించకపోవడంపై భక్తులు మండిపడుతున్నారు. అన్నీ సోషల్ మీడియాలో భక్తులే ప్రచారం చేసుకుంటారు…ఆ డబ్బులు మన ఖాతాలో వేసి ఏంచక్కా భోంచేద్దామన్న రీతిలో ప్రచార సెల్ ఉంది. అసలు దేవస్థానంలో పబ్లిసిటీ సెల్ ఉందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మీడియా వాళ్ల విషయంలోనూ సరైన రీతిలో స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. దేవస్థానం కరపత్రాలను ముద్రించకపోతే ఎంతోమంది భక్తులు వాటిని ముద్రించి అందించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఆదిశగా చర్యలు తీసుకోవడం లేదు.
కవర్లపై ప్రచారానికి ప్రైవేట్‌కు అనుమతి..
ఉభయదాతలకు ఇచ్చే ప్రసాదాల కవర్లను ప్రైవేట్ సంస్థలు ముద్రించి ఇస్తున్నాయి. పవిత్ర ఆలయంలో ప్రైవేట్ సంస్థల ఉచిత ప్రచారానికి అనుమతించేందుకు దేవస్థానం అధికారులకు భారీగానే ముడుపులు ముడుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. అసలు వేలాది రూపాయలు వసూలు చేస్తున్న దేవస్థానం ప్రసాదాల కవర్లను ముద్రించి ఇవ్వలేదా ప్రైవేట్ దుకాణాల షాపుల పేరుతో ఉచిత ప్రచారం చేయడంలో ఉన్న ఆసక్తిలో ఎంతమందికి ఎన్ని వేల రూపాయలు ముడుతున్నాయో ఆ అమ్మవారికే తెలియాలి. అవసరమైన చోట ప్రచారం చేయకుండా ప్రైవేట్ ప్రచారానికి మాత్రం సై అంటున్న అధికారుల తీరుపై భక్తులు మండిపడుతున్నారు.
…సోషల్ మీడియా సెల్ ఎక్కడ?..
దేవస్థానంలో జరిగే అర్చనలు, పూజలు, హోమాలు, ఆర్జిత సేవలపై సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేయాల్సి ఉన్నప్పటికీ ఆదిశగా అధికారులు చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. కనీసం దేవస్థానానికి ఒక యూ ట్యూబ్ చానల్ ఉన్నప్పటికీ దాని గురించి ఎక్కడ కర పత్రాల్లో గాని, ఆహ్వాన పత్రికలో గాని ప్రచారం చేయకపోవడంతో చాలా మందికి దానిగురించి తెలియదు. కనీసం కనకదుర్గ ప్రభలోనైనా దానికి సంబంధించి ప్రకటన లేకపోవడంతో అతి తక్కువ మంది ఖాతాదారులు మాత్రమే ఉన్నారు. అలాగే ఉత్సవ తేదీలు, అలంకారాలపై ఎప్పటికప్పుడు దేవస్థానం అధికారిక సోషల్ మీడియా వేదికగా ఎక్కువ సంఖ్యలో రీల్స్ చేసి అప్‌లోడ్ చేస్తే మరింత మంది భక్తులు ఉత్సవ వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ప్రచురణ, పబ్లిసిటీ వింగ్‌లో ఎప్పటినుంచే పాతుకుపోయినవారిని తప్పించి జెన్‌జీకి అవకాశం కల్పిస్తే సరికొత్త ధోరణిలో అమ్మ ప్రాశస్త్యాన్ని విశ్వవ్యాప్తం చేస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు.
