అమ్మను వీక్షించిన సర్వజనులు..

15 రోజుల్లో 2.29 కోట్ల వీక్షణలు!

సోషల్‌ మీడియాలో మార్మోగిన కనకదుర్గమ్మ దసరా వైభవం
దేశవిదేశాల్లోని భక్తులకు చేరిన అమ్మవారి దివ్య అలంకారాలు..
వివరాలు వెల్లడించిన ఆలయ చైర్మన్‌, ఈవో

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా నిర్వహించిన శ్రీ కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు సామాజిక మాధ్యమాల్లో విశేష ఆదరణ పొందాయి. కేవలం 15 రోజుల్లో అమ్మవారి దివ్య అలంకారాలు, విశేష పూజలు, ప్రత్యక్ష ప్రసారాలు, సాంస్కృతిక కార్యక్రమాలను కలిపి 2.29 కోట్ల వీక్షణలు నమోదయ్యాయి. అక్టోబరు 11 నుంచి 25 వరకు నమోదైన గణాంకాలను దేవస్థానం చైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ఈవో వి.కె. శీనా నాయక్‌ గురువారం వెల్లడించారు. ఫేస్‌బుక్‌లో 50 లక్షలు, ఇన్‌స్టాగ్రామ్‌లో 42.5 లక్షలు, యూట్యూబ్‌లో 25.7 లక్షలకు పైగా వీక్షణలు వచ్చినట్లు తెలిపారు.

యూట్యూబ్‌లో ప్రసారమైన రోజువారీ అలంకార దర్శనాలు, శత చండీయాగం, లక్ష కుంకుమార్చన వంటి విశేష సేవల ప్రత్యక్ష ప్రసారాలకు భక్తుల నుంచి మంచి స్పందన లభించిందన్నారు. ఒక్కో అలంకార ప్రత్యక్ష ప్రసారానికి సగటున 33 వేల నుంచి 57 వేల వరకు వీక్షణలు నమోదయ్యాయని వివరించారు. నగరోత్సవ ఊరేగింపులో గిరిజన ధింసా నృత్యం, కోలాటాలు, కేరళ వాయిద్యాలు, దసరా కళావేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు నెటిజన్లను ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. కృష్ణానది తీరంలో నిర్వహించిన నవహారతులు, తెప్పోత్సవం వీడియోలకూ విశేష స్పందన వచ్చిందన్నారు.

ఉత్సవాలకు ప్రత్యక్షంగా హాజరుకాలేని భక్తులు సైతం డిజిటల్‌ వేదికల ద్వారా అమ్మవారి అలంకారాలు, పూజలను వీక్షించి ఆధ్యాత్మిక అనుభూతి పొందారని చైర్మన్‌, ఈవో తెలిపారు. యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు వాట్సాప్‌ ఛానల్‌, ఎక్స్‌, థ్రెడ్స్‌, టెలిగ్రామ్‌ ఖాతాల ద్వారా ఉత్సవాల సమాచారాన్ని, ప్రత్యక్ష ప్రసారాలను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. భవిష్యత్తులోనూ ఆలయ విశేష పూజలు, ఉత్సవాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలను వివిధ మాధ్యమాల ద్వారా భక్తులకు చేరవేస్తామని వెల్లడించారు.