మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (Former CM KCR) కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) విచారణ ముగిసింది. దాదాపు 50 నిమిషాల పాటు విచారణ సాగింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేసీఆర్‌ను కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ (Justic PC Ghosh) ప్రశ్నించారు. ఈ సందర్భంగా కమిషన్‌కు కేసీఆర్ పలు డాక్లుమెంట్లను అందించారు. మొదట దైవసాక్షిగా వాస్తవాలు చెబుతానని కేసీఆర్ చేత ప్రమాణం చేయించిన కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్. మొత్తం 18 ప్రశ్నలను (18 questions) ఘోష్ అడిగారు. రీ ఇంజనీరింగ్, కార్పొరేషన్ ఏర్పాటు, కేబినెట్ ఆమోదంపై కమిషన్ ప్రశ్నలు వేసింది. రీ ఇంజనీరింగ్ చేయడానికి ప్రధాన కారణాలను కేసీఆర్ సుదీర్ఘంగా వివరించారు.
ప్రతిదీ కేబినెట్ (Cabinet) ఆమోదంతో జరిగిందని కేసీఆర్ వివరణ ఇచ్చారు. కేబినెట్ ఆమోదంతోనే ప్రభుత్వం అన్ని నిర్ణయాలు తీసుకుందన్నారు. స్థల మార్పు నీటి లభ్యత, కాళేశ్వరం నిర్మాణంపై వ్యాప్కోస్ నివేదిక ఇచ్చిందని కమిషన్‌కు చెప్పారు. లైఫ్ లైన్ (Life Line) కాళేశ్వరం పుస్తకాన్ని కమిషన్‌కు అందజేశారు. అందులో కాళేశ్వరం ఉద్దేశ్యాలను వివరించారు. నిధుల సమీకరణ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశామని.. బ్యారేజీల్లో నీటి నిలువ అనేది ఇంజనీర్లు తీసుకునే నిర్ణయం తనకు సంబంధం లేదని కేసీఆర్ వెల్లడించారు.
బ్యారేజీల్లో నీటి నిల్వ కోసం మీరేమైనా ఆదేశాలు ఇచ్చారా అని కమిషన్ ప్రశ్నించగా… తాను అలాంటి ఆదేశాలు ఇవ్వలేదని.. బ్యారేజీలు నీటిని ఎత్తిపోయడానికి నిర్మించినవి అని కేసీఆర్ సమాధానమిచ్చారు. ప్రాజెక్ట్ లొకేషన్ మార్పు నిర్ణయం ఎవరిది అంటూ కమిషన్ మరో ప్రశ్న సంధించింది. లొకేషన్ ఎందుకు మార్చాల్సి వచ్చిందో కేసీఆర్ సుదీర్ఘంగా వివరించారు. సీడబ్ల్యూసీ తుమ్మిడి హట్టి వద్ద నీటి లభ్యత లేదని చెప్పిందని.. వ్యాప్కోస్ సర్వే చేసి నివేదిక ఇచ్చిందన్నారు. టెక్నికల్ టీం మూడు బ్యారేజీలు నిర్మించాలని చెప్పిందన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి మహారాష్ట్ర అంగీకరించలేదని చెప్పారు. టెక్నికల్ టీం ఇచ్చిన నివేదిక మేరకు లోకేషన్ మార్పు జరిగిందన్నారు. నిర్ణయాలన్నీ కేబినెట్ ఆమోదంతోనే జరిగాయని కేసీఆర్ చెప్పారు. నాణ్యతకు అత్యంత ప్రాధాన్యమిచ్చాన్నారు కేసీఆర్.. చివరగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన పుస్తకాన్ని కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్‌కు కేసీఆర్ అందజేశారు.