Kaleshwaram Project Repairs | చుట్టుముట్టిన సాంకేతిక సమస్యలు.. ‘కాళేశ్వరం’ సీన్‌ రివర్స్‌!

  • కొత్తగా టెండర్లు పిలిచి పనులు అప్పగించేందుకు ఇప్పట్లో అవకాశాలు కరవు
  • మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లలోనూ అనేక లోపాలు
  • లోపాలను సరిదిద్దాకే మరమ్మతులు చేపట్టాలని ఎన్డీఎస్‌ఏ, నిపుణుల కమిటీ సూచన
  • ఏ కోణంలో చూసినా.. బహుళ ప్రయోజనాల ప్రాజెక్టు అందుబాటులోకి రావడం కష్టసాధ్యమే
  • అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే అధ్యయనం చేసి మరమ్మతులకు శ్రీకారం చుట్టాలని రేవంత్‌ సర్కారు నిర్ణయం
  • ఆ తర్వాత ప్రతికూల పరిణామాలు.. వెలుగుచూస్తున్న సాంకేతిక సమస్యలతో సతమతం
  • ప్రస్తుత పరిస్థితుల్లో మరమ్మతుల వ్యయం ప్రభుత్వ ఖజానాపై మోయలేని భారం
  • మూడు బ్యారేజీల మరమ్మతులకు రూ.1,000 కోట్ల నుంచి రూ.1,200 కోట్ల వరకు అంచనా వ్యయం
  • ఒక్క మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణకే రూ.700 కోట్లకు పైగా నిధులు అవసరం

Kaleshwaram Project Repairs | హైదరాబాద్‌, ఆంధ్రప్రభ పొలిటికల్‌ బ్యూరో : దేశంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకాలలో ఒకటిగా నిర్మితమైన కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలను సాంకేతిక సమస్యలు చుట్టుముట్టాయి. నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ నిర్వహణ బాధ్యతలు చేపట్టేందుకు వెనుకడుగు వేయడంతో కొత్తగా టెండర్లు పిలవడం, పనులు అప్పగించడం, నిపుణులతో అధ్యయనం చేయించడం వంటి ప్రక్రియలకు మరింత సమయం పట్టే అవకాశముంది.

మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లలోని లోపాలపై గతంలో జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (ఎన్‌డీఎస్‌ఏ) నివేదిక ఇచ్చింది. అయితే, ఆ నివేదికతో పాటు ప్రస్తుత పరిస్థితులపైనా సమగ్రంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. లోపాలను సరిదిద్దిన తర్వాతే మరమ్మతులు చేపట్టాలని సూచిస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో వచ్చే వానాకాలం నాటికి మూడు బ్యారేజీల మరమ్మతులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావడం కష్టసాధ్యంగానే కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే అధ్యయనం చేసి మరమ్మతులు ప్రారంభించాలని భావించిన ప్రజా ప్రభుత్వం.. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో ముందుకెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. 2024 మేలో ఎన్‌డీఎస్‌ఏ నివేదిక వెలువడిన అనంతరం నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ లోపాలను అంగీకరించి, సొంత ఖర్చులతో మరమ్మతులు చేస్తామని ప్రభుత్వానికి తెలిపింది. అయితే, ఆ తర్వాత పరిణామాలతో ప్రభుత్వంతో సమన్వయం తగ్గి, చివరకు మరమ్మతుల బాధ్యత నుంచి వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

దీంతో ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చింది. మరమ్మతులపై నిర్ణయం తీసుకునే ముందు నీటిపారుదల శాఖ ఇంజినీర్లు సమగ్రంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఏర్పడింది. విజిలెన్స్‌ నివేదికలోని అంశాలనూ పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.

పునాదుల పరిశీలనే కీలకం

కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీని పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు అనేక సాంకేతిక అవాంతరాలు ఎదురవుతున్నాయి. బ్యారేజీ పునాదుల కింద ఉన్న భూగర్భ నిర్మాణం, నదీగర్భ స్వభావాన్ని కచ్చితంగా నిర్ధారించిన తర్వాతే పునరుద్ధరణకు అవసరమైన డిజైన్లు రూపొందించాల్సి ఉంటుంది. ఇందుకోసం బ్యారేజీ కాజ్‌వే, స్పిల్‌వే ప్రాంతాల్లో బోర్‌హోల్స్‌ తవ్వాల్సి ఉంది. అయితే, ఈ ప్రక్రియలోనే సమస్యలు ఎదురవుతున్నాయి.

మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్ద భూభౌతిక, భూసాంకేతిక పరీక్షలు నిర్వహించేందుకు పుణెలోని కేంద్ర నీటి, విద్యుత్‌ పరిశోధన కేంద్రం (సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌)కు గతంలో పనులు అప్పగించారు. పరీక్షల్లో భాగంగా బోర్‌హోల్స్‌ తవ్వేందుకు ప్రయత్నించగా సాంకేతిక సమస్యలు ఎదురైనట్లు నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి, బోర్‌హోల్స్‌ తవ్వేందుకు తగిన సలహాలు, సూచనలు ఇచ్చేలా డ్రిల్లింగ్‌ నిపుణుడిని పంపించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ తాజాగా మరోసారి సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ను కోరింది.

రూ.1,200 కోట్ల వరకు వ్యయం

మూడు బ్యారేజీల మరమ్మతులకు అయ్యే ఖర్చుపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. ఒప్పందంలోని లోపాల బాధ్యత కాలంలోనే బ్యారేజీలకు సమస్యలు తలెత్తడం, పనులు పూర్తికాకుండానే పూర్తయినట్లు ధ్రువీకరణ పత్రాలు జారీ కావడం వంటి అంశాల నేపథ్యంలో నిర్మాణ సంస్థలే మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, మేడిగడ్డ నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ కొత్తగా వర్క్‌ అగ్రిమెంట్‌ చేసుకోవాలని పట్టుబడుతున్నట్లు సాగునీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

మూడు బ్యారేజీల మరమ్మతులకు రూ.1,000 కోట్ల నుంచి రూ.1,200 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. ఇందులో ఒక్క మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణకే రూ.700 కోట్లకు పైగా అవసరమవుతాయని అధికారులు భావిస్తున్నారు. నిర్మాణ సంస్థలు ముందుకు రాకపోతే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఆర్థికపరమైన అంశాలతో పాటు సాంకేతిక సమస్యలూ ఎదురవుతున్న నేపథ్యంలో కాళేశ్వరం బ్యారేజీల మరమ్మతుల వ్యవహారాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

విజిలెన్స్‌ నివేదికలో కీలక అంశాలు

మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి సర్వే, పరిశోధనలు, నిర్వహణ సహా అనేక అంశాలు కారణమని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తన నివేదికలో పేర్కొంది. మొత్తం 15 రకాల లోపాలను గుర్తించినట్లు తెలిపింది. డిజైన్లు, సీకెంట్‌ పైల్స్‌ నిర్మాణం, పనులు పూర్తయ్యాక కాఫర్‌ డ్యాంకు సంబంధించిన పదార్థాలను తొలగించకపోవడం, పనులు పూర్తికాకుండానే పూర్తయినట్లు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం, గడువు పొడిగింపులో లోపాలు వంటి అంశాలను నివేదికలో వివరించింది.

సరైన పరిశీలన లేకుండానే రెండోసారి సవరించిన అంచనాలను రాష్ట్రస్థాయి స్టాండింగ్‌ కమిటీ ఆమోదించిందని విజిలెన్స్‌ పేర్కొంది. మొదటిసారి సవరించిన అంచనాల్లోని అంశాలనే రెండోసారి పొందుపరిచినా సంబంధిత చీఫ్‌ ఇంజినీర్‌ను కమిటీ ప్రశ్నించలేదని తెలిపింది. ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ మాన్యువల్‌ రూపకల్పనలో వైఫల్యం, పర్యవేక్షణ లోపాలనూ ప్రస్తావించింది. రాష్ట్రస్థాయి స్టాండింగ్‌ కమిటీలోని సభ్యులందరిపై క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌కు సిఫార్సు చేసింది.

అలైన్‌మెంట్‌ ఆమోదం, క్షేత్రస్థాయి పరిశోధనలు లేకుండానే డ్రాయింగ్‌లను సీడీవోకు పంపడం, మోడల్‌ అధ్యయనాలకు తగిన ఆధారాలు లేకుండానే బ్యారేజీ పూర్తిస్థాయి నీటిమట్టాన్ని నిర్ణయించడం, పనులన్నీ పూర్తికాకముందే నీటి నిల్వకు అనుమతించడం వంటి అంశాలనూ నివేదికలో ప్రస్తావించింది. సీకెంట్‌ పైల్స్‌ నిర్మాణ పర్యవేక్షణలో లోపాలు, క్వాలిటీ కంట్రోల్‌, నిర్వహణ విభాగాల వైఫల్యాలనూ వివరించింది. ఈ నేపథ్యంలో అప్పటి ప్రాజెక్టు ఈఎన్‌సీగా పనిచేసి పదవీ విరమణ చేసిన వెంకటేశ్వర్లుపై పలు అభియోగాలు నమోదయ్యాయి.

నిపుణుల అధ్యయనంపై ప్రభుత్వం దృష్టి

మరమ్మతుల పనులను ప్రారంభించేందుకు ముందు మూడు కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థల నిపుణుల అభిప్రాయాలను తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్‌డీఎస్‌ఏ సూచించిన మరమ్మతులను వాటి సిఫార్సులకు అనుగుణంగా చేపట్టే అంశంపై మంత్రివర్గం ఇటీవల చర్చించింది. ఇందులో భాగంగా సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌, సెంట్రల్‌ సాయిల్‌ అండ్‌ మెటీరియల్స్‌ రీసెర్చ్‌ స్టేషన్‌, నేషనల్‌ జియాలజికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నిపుణులను రంగంలోకి దించింది.

పుణె నుంచి వచ్చిన నిపుణులు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, నష్టం వాటిల్లడానికి గల కారణాలను విశ్లేషించారు. విజిలెన్స్‌, ఎన్‌డీఎస్‌ఏ, ఆరుగురు నిపుణులతో కూడిన కమిటీ గతంలో నిర్వహించిన అధ్యయన నివేదికలనూ పరిశీలించారు. అధ్యయనంలో గుర్తించిన అంశాలను రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో వివరించారు.

బోర్‌హోల్స్‌ తవ్వడమే సవాలు

మేడిగడ్డ బ్యారేజీ కింద నదీగర్భ స్వభావాన్ని కచ్చితంగా నిర్ధారించడం నీటిపారుదల శాఖకు సవాలుగా మారింది. కాజ్‌వే, స్పిల్‌వే ప్రాంతాల్లో బోర్‌హోల్స్‌ తవ్వడం సాంకేతిక సమస్యలతో కష్టంగా మారడంతో సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ సహాయాన్ని శాఖ కోరింది. ఈ మేరకు రామగుండం చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీనివాస్‌ గుప్తా ఆ సంస్థ డైరెక్టర్‌కు లేఖ రాశారు. సమగ్ర పరిశీలన చేసి తగిన సూచనలు ఇచ్చేందుకు డ్రిల్లింగ్‌ నిపుణుడిని పంపించాలని కోరారు.

మేడిగడ్డ బ్యారేజీలో ఏడో బ్లాక్‌ కుంగడానికి కారణాలను గుర్తించాలంటే అవసరమైన పరీక్షలు నిర్వహించాలని ఎన్‌డీఎస్‌ఏ నిపుణుల కమిటీ 2024లోనే సిఫార్సు చేసింది. పరీక్షల ఫలితాల ఆధారంగానే పునరుద్ధరణ డిజైన్లు సిద్ధం చేయాల్సి ఉంటుంది. గతంలోనూ బ్యారేజీల పునాదుల కింద నదీగర్భాన్ని పరిశీలించేందుకు బోర్‌హోల్స్‌ తవ్వినప్పుడు ఇసుక, నీరు బయటకు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.

వానాకాలం వచ్చేలోగా పరీక్షలు పూర్తిచేసి, ఫలితాలను పునరుద్ధరణ డిజైన్లు రూపొందించే బాధ్యతను పొందిన అఫ్రీ ఇండియా సంస్థకు అందించాలని నీటిపారుదల శాఖ భావిస్తోంది. అయితే, ఈ ప్రక్రియలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు పనుల వేగాన్ని ప్రభావితం చేస్తున్నాయి.

ఏడాదిన్నర పట్టే అవకాశం

మేడిగడ్డ బ్యారేజీ 2023 అక్టోబర్‌లో కుంగిపోయిన తర్వాత జియోటెక్నికల్‌ పరీక్షలు నిర్వహించి పునరుద్ధరణ డిజైన్లు రూపొందించాలని, ఏడో బ్లాక్‌ను పూర్తిగా తొలగించాలని ఎన్‌డీఎస్‌ఏ తన నివేదికలో సూచించింది. ఈ నేపథ్యంలో మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్ద భూసాంకేతిక పరీక్షలు నిర్వహించేందుకు సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌కు బాధ్యతలు అప్పగించారు.

మూడు బ్యారేజీల్లో కలిపి సుమారు 500 బోర్‌హోల్స్‌ తవ్వాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మేడిగడ్డలోని 85 గేట్ల వద్ద ఎగువ, దిగువ ప్రాంతాల్లో బోర్‌హోల్స్‌ తవ్వడంతో పాటు ఎగువ ప్రవాహ ప్రాంతంలోనూ అవసరమైన చోట పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. రీన్‌ఫోర్స్డ్‌ రాఫ్ట్‌లకు నష్టం కలగకుండా సుమారు 25 మీటర్ల లోతు వరకు బోర్‌హోల్స్‌ తవ్వాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
ఈ పనులను వేగంగా చేపడితే రాఫ్ట్‌లు దెబ్బతినే ప్రమాదం ఉండటంతో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి వస్తోంది. అందువల్ల బోర్‌హోల్స్‌ తవ్వడం, భూసాంకేతిక పరిశోధనలు పూర్తిచేయడానికే కనీసం ఏడాది నుంచి ఏడాదిన్నర సమయం పట్టవచ్చని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మూడు బ్యారేజీల్లోనూ పరీక్షలు తప్పనిసరి

గతంలో జలసౌధలో నిర్వహించిన సమీక్షలో ఎన్‌డీఎస్‌ఏ చైర్మన్‌ అనిల్‌ జైన్‌.. అన్ని బోర్‌హోల్స్‌ తవ్వే బదులు మేడిగడ్డలో కుంగిన ఏడో బ్లాక్‌ వద్ద మాత్రమే పరీక్షలు నిర్వహించవచ్చని సూచించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే, ఎన్‌డీఎస్‌ఏ తుది నివేదికలో మాత్రం మూడు బ్యారేజీల్లోని అన్ని గేట్ల వద్ద భూసాంకేతిక పరిశోధనలు నిర్వహించాలని పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ఈ రెండు సూచనల మధ్య స్పష్టత లేకపోవడంతో అధికారులు సందిగ్ధంలో పడ్డారు. ఒక్క బ్లాక్‌ వద్ద పరీక్షలు నిర్వహించడం సరిపోదని, మూడు బ్యారేజీల్లోని అన్ని బ్లాకుల్లోనూ పరిశోధనలు చేయాల్సిందేనని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. సమగ్ర పరిశోధనలు పూర్తయిన తర్వాతే పునరుద్ధరణ డిజైన్లను ఖరారు చేయగలమని నిపుణులు చెబుతున్నారు.

ఆర్థిక భారం, నిర్మాణ సంస్థల వైఖరి, పునాదుల పరిశీలనలో సాంకేతిక అవాంతరాలు కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణను మరింత జటిలం చేస్తున్నాయి. అవసరమైన పరీక్షలు పూర్తయి, లోపాలపై స్పష్టత వచ్చి, పునరుద్ధరణ డిజైన్లు సిద్ధమయ్యే వరకు మరమ్మతుల పనులు వేగం పుంజుకోవడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.