భక్తి గీతాల ‘రాగసాగరం’ పుస్తకావిష్కరణ

  • కళావేదికలో ఘనంగా కార్యక్రమం..
  • రచయిత చెరుకుమల్లి వెంకటేశ్వరరావు దంపతులకు సన్మానం

వైరా, ఆంధ్రప్రభ : వైరాలోని శ్రీ కోదండ రామాలయంలో కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ రచయిత చెరుకుమల్లి వెంకటేశ్వరరావు రచించిన భక్తి గీతాల ‘రాగసాగరం’ పుస్తకాన్ని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ కాపా చంద్రకళ మురళీకృష్ణ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో ఎందరో మహానుభావులు తమ కీర్తనల ద్వారా భక్తి రసాన్ని ప్రజలకు అందించారని తెలిపారు. భారతీయ సంస్కృతి, సనాతన ధర్మంలో సంగీతానికి విశిష్ట స్థానం ఉందన్నారు. లలిత కళల్లో ముఖ్యమైన సంగీతం ద్వారా భగవంతుడిని ఆరాధించడమే భక్తి గీతాల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.

చెరుకుమల్లి వెంకటేశ్వరరావు రచించిన భక్తి గీతాలను ‘రాగసాగరం’ యూట్యూబ్‌ వేదిక ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని ఆమె ప్రశంసించారు.

భక్తి గీతాలతో అలరించిన కళాకారులు

కార్యక్రమంలో నృత్య కళా భారతి, చెరుకుమల్లి భక్తి గీత బృందాల కళాకారులు భక్తి గీతాలు ఆలపించారు. నాట్య కళలకు విశిష్ట సేవలందిస్తున్న నృత్యభూషణ్‌ అవార్డు గ్రహీత పీవీ నటరాజును ఘనంగా సన్మానించారు. లలిత కళలను ప్రోత్సహిస్తున్న సంగీత విద్వాంసురాలు ముటుకుల హైమావతి ప్రసాద్‌ వాయిద్య సహకారంతో కార్యక్రమం భక్తిరసాన్ని పంచింది.

భక్తి గీతాలను ప్రజలకు మరింత చేరువ చేస్తున్న చెరుకుమల్లి వెంకటేశ్వరరావు, నిర్మల దంపతులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. సాయి మణికంఠ భక్త బృందం, శ్రీ సాయి మణికంఠ భజన మండలి, వాసవి నటరాజ బృందం, నాగసాయి నటరాజ వంశీ తదితరులు భక్తి గీతాలు ఆలపించారు. చెరుకుమల్లి వెంకటేశ్వరరావు ఆలపించిన ‘నీ పూజ’ భక్తి గీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

కార్యక్రమంలో విశిష్ట అతిథులు కే. దేవరాయలు, డాక్టర్‌ భూమేశ్వరరావు, డాక్టర్‌ కాపా మురళీకృష్ణ, కట్ట కృష్ణార్జున్‌, వనమా విశ్వేశ్వరరావు, నామ లక్ష్మీనారాయణ, భూక్య వీరభద్రం, లోక వేణు, లోక రమాదేవి, నూకల అన్నపూర్ణ, 5, 12వ వార్డు కౌన్సిలర్లు కట్టా స్వరూపరాణి, మాదినేని సునీత, భక్త బృందాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.