కదిరి మున్సిపల్ పీఠంపై ‘కూటమి’ గురి!
క్లీన్‌స్వీప్ లక్ష్యంగా టీడీపీ వ్యూహాలు..
అభ్యర్థుల వడపోతకు తెర
శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : కదిరి మున్సిపాలిటీలో స్థానిక ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడినా ఎదుర్కొనేందుకు అధికార కూటమి పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మున్సిపాలిటీలో తన బలాన్ని మరింత పెంచుకుని అన్ని వార్డుల్లోనూ కూటమి అభ్యర్థులను గెలిపించుకోవడమే లక్ష్యంగా వ్యూహాలకు పదునుపెడుతోంది. మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని మరోసారి కైవసం చేసుకోవడంతో పాటు క్లీన్‌స్వీప్ సాధించాలనే లక్ష్యంతో పార్టీ నాయకత్వం ముందుకు సాగుతోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయం సాధించిన తర్వాత కదిరి పట్టణ రాజకీయ సమీకరణాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. గత ఏడాది మేలో జరిగిన మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దిల్‌షాదున్నీసా చైర్‌పర్సన్‌గా ఎన్నిక కావడంతో మున్సిపల్ రాజకీయాల్లో కూటమి పట్టు మరింత బలపడింది.
స్థానిక ఎన్నికల నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ పదవులకు పోటీ చేయాలని భావిస్తున్న ఆశావహుల వివరాలను పార్టీ నాయకత్వం ఇప్పటికే సేకరించింది. సెప్టెంబర్ చివరి వారంలో కదిరి మున్సిపల్ పరిధిలోని ఆశావహుల జాబితాను జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎం.ఎస్. రాజుకు అందజేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రిజర్వేషన్లపై స్పష్టత వచ్చిన వెంటనే వార్డుల వారీగా అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయాలని నాయకత్వం భావిస్తోంది. గెలుపు అవకాశాలు, సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల స్థానిక పట్టుతో పాటు ఆయా వార్డుల్లో పార్టీ బలాబలాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా 23వ వార్డుతో పాటు పలు ప్రాంతాలకు చెందిన వైసీపీ నాయకులు, ముస్లిం మైనార్టీ కుటుంబాలు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సమక్షంలో టీడీపీలో చేరడం కూటమి శ్రేణుల్లో ఉత్సాహాన్ని పెంచింది. ఈ చేరికలతో మైనార్టీ, బీసీ వర్గాల్లో తమకు మరింత మద్దతు పెరిగిందని టీడీపీ నాయకులు చెబుతున్నారు. అయితే ఎన్నికల ఫలితాలపై ఇప్పుడే తుది అంచనాలు వేయడం సరికాదని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.
కదిరి నియోజకవర్గ టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ స్థానిక ఎన్నికలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లోనూ కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని, మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని మరోసారి కైవసం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చినట్లు పేర్కొన్నాయి. దీంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు వార్డుల వారీగా సమీకరణాలను పరిశీలిస్తూ ఎన్నికల కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. అభ్యర్థుల ఎంపిక పూర్తయిన వెంటనే ఇంటింటి ప్రచారం, వార్డు స్థాయి సమావేశాలు, ఓటర్లతో మమేకమయ్యే కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. మరోవైపు టీడీపీ క్లీన్‌స్వీప్ లక్ష్యంగా ముందుకు సాగుతుండగా, వైసీపీ కూడా తనకు అనుకూలమైన వార్డులను గుర్తించి పట్టు నిలుపుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల ఫలితాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, అభ్యర్థుల వ్యక్తిగత బలాబలాలు, స్థానిక సమస్యలు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశముంది. మొత్తంగా నోటిఫికేషన్ వెలువడకముందే కదిరిలో రాజకీయ వేడి పెరుగుతోంది. రిజర్వేషన్లపై స్పష్టత వచ్చిన తర్వాత పోటీ మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంది.
