Kabaddi Competitions | మరో కలికితురాయి..

Kabaddi Competitions | మరో కలికితురాయి..
Kabaddi Competitions | గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో (Ntr Stadiam) అండర్-14 జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. 2026 జనవరి 19వ తేదీ నుండి 23 వరకు జరిగే పోటీలను ఐక్యంగా పని చేస్తూ విజయవంతం చేస్తామని ఆయన అన్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జనవరి 19వ తేదీ నుండి ఐదు రోజుల పాటు జరిగే పోటీల నిర్వహణ పై స్టేడియం కార్యాలయంలో అధికారులతో ఎమ్మెల్యే రాము మంగళవారం సమావేశం అయ్యారు.
సమావేశంలో పాల్గొన్న స్కూల్ గేమ్స్ (School Games) ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి భానుమూర్తి రాజుతో పలు అంశాల పై ఎమ్మెల్యే రాము మాట్లాడారు. పోటీల విజయవంతానికి ప్రభుత్వ పరంగానే కాకుండా, గుడివాడలో తాము అన్ని విధాలుగా సహకరిస్తామని భరోసా ఇచ్చారు. వివిధ రాష్ట్రాల నుండి వచ్చే క్రీడాకారులకు సౌకర్యాలతో పాటుగా, నాణ్యమైన ఆహారం అందించేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే రాము సూచించారు.
గుడివాడ క్రీడా కిరీటంలో స్కూల్ గేమ్స్ జాతీయ పోటీల రూపంలో మరో కలికితురాయి చేరనుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము (Mla Ramu) అన్నారు. జాతీయ స్థాయిలో జరిగే పోటీల విజయవంతానికి అన్ని విధాలుగా కృషి చేస్తామన్నారు. క్రీడాభిమానులు, గుడివాడ ప్రజలు పోటీల్లో ప్రత్యక్షంగా పాల్గొని, క్రీడాకారులను ఉత్సాహపరచాలన్నారు. వివిధ రాష్ట్రాల నుండి క్రీడల్లో పాల్గొనే విద్యార్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లను ఇప్పటికే మొదలుపెట్టామని ఆయన చెప్పారు. పోటీల విజయవంతంలో ప్రభుత్వ శాఖలు కూడా భాగస్వామ్యం అవుతాయని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గుడివాడ మున్సిపల్ కమిషనర్ ఎస్. మనోహర్, జనసేన (Janasena) ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, స్టేడియం కమిటీ సంయుక్త కార్యదర్శి కిలారపు రంగ ప్రసాద్, గుడివాడ తాసిల్దార్ కిరణ్, ఎండిఓ విష్ణు ప్రసాద్, కే రవికుమార్, టీడీపీ నాయకులు నిమ్మగడ్డ సత్య సాయి, బాంబే శీను, వేసిపోగు ఇమ్మానియేల్, సయ్యద్ జబీన్, ఎంఈఓలు, పీడీలు తదితరులు పాల్గొన్నారు.
