కె.ఎల్‌.రావు పార్క్‌ స్విమ్మింగ్‌ విద్యార్థుల ప్రతిభ.. పలు పతకాలు

చిట్టినగర్‌, ఆంధ్రప్రభ:విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 46వ డివిజన్‌లో ఉన్న డాక్టర్‌ కె.ఎల్‌.రావు పార్క్‌ స్విమ్మింగ్‌ పూల్‌ విద్యార్థులు స్విమ్మింగ్‌ పోటీల్లో సత్తా చాటారు. వివిధ విభాగాల్లో పోటీపడి పలు పతకాలు సాధించారు.ఆగస్టు 30న విజయవాడ గాంధీనగర్‌ స్విమ్మింగ్‌ పూల్‌లో నిర్వహించిన రోటరీ మిడ్‌టౌన్‌ ఇంటర్‌ స్కూల్‌ స్విమ్మింగ్‌ ఛాంపియన్‌షిప్‌–2026లో కె.ఎల్‌.రావు పార్క్‌ స్విమ్మింగ్‌ పూల్‌ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు.

5వ తరగతి విద్యార్థిని ఎం. హిమశ్రీ 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో సిల్వర్‌ మెడల్‌ సాధించింది. 6వ తరగతి విద్యార్థిని టి. లతిక 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో గోల్డ్‌ మెడల్‌ దక్కించుకుంది.

8వ తరగతి విద్యార్థి కె. రఘు మూడు పతకాలు సాధించాడు. 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌, 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో గోల్డ్‌ మెడల్స్‌, 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో సిల్వర్‌ మెడల్‌ గెలుచుకున్నాడు.

9వ తరగతి విద్యార్థిని వి. భావన శివగామి 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌, 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌, 50 మీటర్ల ఫ్రీస్టైల్‌లో గోల్డ్‌ మెడల్స్‌ సాధించింది. అదే తరగతికి చెందిన పి. రోహిత్‌ 100 మీటర్ల ఫ్రీస్టైల్‌లో సిల్వర్‌, 50 మీటర్ల ఫ్రీస్టైల్‌లో బ్రాంజ్‌ మెడల్‌ సాధించాడు. కె. జీవన్‌ నిఖల్‌ 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో బ్రాంజ్‌ మెడల్‌ గెలుచుకున్నాడు.

పతకాలు సాధించిన విద్యార్థులను తోటి విద్యార్థులు, స్విమ్మింగ్‌ కోచ్‌ రఫీ, ఎన్టీఆర్‌ జిల్లా స్విమ్మింగ్‌ సంఘం అధ్యక్షుడు, సభ్యులు, మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు అభినందించారు. విద్యార్థులు ఇదే స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.