Women’s Junior Asia Cup | జూనియ‌ర్ల జోరు !

  • జపాన్‌పై భారత్‌ ఘన విజయం..
  • క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లిన జూనియర్‌ మహిళల హాకీ జట్టు

మోకీ (చైనా), ఆంధ్రప్రభ : మహిళల జూనియర్‌ ఆసియా కప్‌-2026లో భారత జట్టు దూకుడు కొనసాగిస్తోంది. ఎలైట్‌ పూల్‌లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో జపాన్‌పై భారత్‌ 7-0తో ఘన విజయం సాధించింది. వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసిన భారత జట్టు… టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ను ఖాయం చేసుకుంది.

టోర్నీలో తొలి మ్యాచ్‌లో కొరియాపై 4-1తో గెలిచిన భారత్‌.. ఆ తర్వాత మలేసియాపై ఏకంగా 11-1 తేడాతో విజయం సాధించింది. అదే జోరును జపాన్‌పైనా కొనసాగించింది. మ్యాచ్‌ ఆరంభం నుంచే ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచిన భారత జట్టు ఐదో నిమిషంలో కృష్ణ శర్మ గోల్‌తో ఖాతా తెరిచింది.

తొమ్మిదో నిమిషంలో జపాన్‌ డిఫెండర్‌ సర్కిల్‌లో ఫౌల్‌ చేయడంతో భారత్‌కు పెనాల్టీ స్ట్రోక్‌ లభించింది. సుప్రియా ఎలాంటి పొరపాటు చేయకుండా బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపడంతో భారత్‌ ఆధిక్యం 2-0కు చేరింది. 14వ నిమిషంలో పూర్ణిమ యాదవ్‌ ఫీల్డ్‌ గోల్‌ చేయడంతో తొలి క్వార్టర్‌ ముగిసే సమయానికి భారత్‌ 3-0 ఆధిక్యంలో నిలిచింది.

మూడో క్వార్టర్‌లో భారత జట్టు మరింత విజృంభించింది. 41వ నిమిషంలో గీతా యాదవ్‌ ఫీల్డ్‌ గోల్‌ చేసి స్కోరును 4-0కు చేర్చింది. 45వ నిమిషంలో మరో గోల్‌ చేసి తన ఖాతాలో రెండో గోల్‌ను నమోదు చేసింది. అనంతరం 46వ నిమిషంలో పూర్ణిమ యాదవ్‌ మరోసారి గోల్‌ చేసి వ్యక్తిగతంగా రెండో గోల్‌ సాధించడంతో భారత్‌ ఆధిక్యం 6-0కు పెరిగింది.

50వ నిమిషంలో సానికా చంద్రకాంత్‌ మానే గోల్‌ చేయడంతో భారత్‌ 7-0తో తిరుగులేని విజయాన్ని అందుకుంది. జపాన్‌కు ఒక్క గోల్‌ కూడా చేసే అవకాశం ఇవ్వకుండా భారత జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.