జూనియర్‌ బాలుర కబడ్డీ జిల్లా జట్టు ఎంపిక

22 మంది క్రీడాకారుల ఎంపిక.. 19 నుంచి శిక్షణ శిబిరం

ముప్కాల్, ఆంధ్రప్రభ : ముప్కాల్‌ మండల కేంద్రంలోని భూదేవి ఇండోర్‌ స్టేడియంలో బుధవారం నిర్వహించిన జూనియర్‌ బాలుర కబడ్డీ జిల్లా జట్టు ఎంపికలను తెలంగాణ ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ ఈరవత్రి అనిల్‌ ప్రారంభించారు. ఆయన వెంట జిల్లా డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి కె. గంగాధర్‌రెడ్డి ఆధ్వర్యంలో క్రీడాకారుల ఎంపిక ప్రక్రియ కొనసాగింది. సీనియర్‌ కబడ్డీ క్రీడాకారులు అనురాధ, అశోక్‌, గంగాధర్‌ ఎంపికలను పర్యవేక్షించారు. ప్రతిభ కనబరిచిన 22 మంది క్రీడాకారులను జిల్లా జట్టు కోసం ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఎంపికైన క్రీడాకారులకు ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం 23న తుది ఎంపికలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. తుది ఎంపికైన జిల్లా జట్టు ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు వేములవాడలో జరిగే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొంటుందని తెలిపారు.

కార్యక్రమంలో వేల్పూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ముత్యం రెడ్డి, ఎలేటి రాములు, జి. గంగారం, మల్లారెడ్డి, ప్రశాంత్‌, సీనియర్‌ కబడ్డీ క్రీడాకారులు పీడీ రాజ్‌కుమార్‌, పీఈటీ సాయిలు, మండల కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.