కస్తూర్బా పాఠశాల స్థలంపై జాయింట్ సర్వే!
అటవీ, రెవెన్యూ భూమి వివాదానికి పరిష్కారం దిశగా అధికారుల చర్యలు
లింగాపూర్, ఆంధ్రప్రభ : లింగాపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల స్థలానికి సంబంధించి నెలకొన్న భూ వివాదంపై గురువారం అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించారు.
పాఠశాల స్థలం అటవీ భూమి అని ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ భూమి అని రెవెన్యూ అధికారులు పేర్కొంటుండటంతో వివాదం కొనసాగుతోంది. ఈ కారణంగా పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణ పనులకు కూడా ఆటంకం ఏర్పడింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇరు శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పాఠశాల స్థలాన్ని నాలుగు వైపులా కొలతలు వేశారు. భూమి విస్తీర్ణం, హద్దులు, సరిహద్దులను గుర్తించి వాస్తవ పరిస్థితిని నిర్ధారించేందుకు సర్వే చేపట్టారు. సర్వే వివరాలతో కూడిన నివేదికను జిల్లా కలెక్టర్‌కు అందజేయనున్నారు. కార్యక్రమంలో ఎఫ్‌డీఓ అప్పయ్య, తహసీల్దార్ నాగరాజు, జోడేఘాట్ రేంజ్ అటవీ అధికారి రమేష్, సర్పంచ్ రాజశేఖర్, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.
