ఐఐటీ తిరుపతిలో వెల్డింగ్ పరిశోధనా కేంద్రం..

  • లింకన్ ఎలక్ట్రిక్ ఇండియా, ఐఐటీ తిరుపతి సంయుక్త భాగస్వామ్యం

ఏర్పేడు, ఆంధ్రప్రభ: ప్రముఖ పారిశ్రామిక సంస్థ లింకన్ ఎలక్ట్రిక్ ఇండియా, ప్రతిష్ఠాత్మక ఐఐటీ తిరుపతి సంయుక్త భాగస్వామ్యంతో ఏర్పేడులోని ఐఐటీ తిరుపతి ప్రాంగణంలో వెల్డింగ్‌ పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించాయి. వెల్డింగ్‌, అనుబంధ రంగాల్లో పరిశోధనలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి, నైపుణ్య శిక్షణను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. లింకన్‌ ఎలక్ట్రిక్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ శివపాథసుందరం కాజా, ఐఐటీ తిరుపతి డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ కె.ఎన్‌. సత్యనారాయణ సంయుక్తంగా కేంద్రం చిహ్నాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రొఫెసర్‌ కె.ఎన్‌. సత్యనారాయణ మాట్లాడుతూ వెల్డింగ్‌ రంగంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన లింకన్‌ ఎలక్ట్రిక్‌ సంస్థతో కలిసి పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు, పరిశోధకులు, పరిశ్రమల నిపుణులు ఒకే వేదికపైకి వచ్చి సరికొత్త సాంకేతికతలను అభివృద్ధి చేయడానికి ఈ కేంద్రం ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా పరిశోధనలను ప్రోత్సహించడంతో పాటు విద్యార్థులకు నైపుణ్యాలను పెంపొందించుకునే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు.

అనంతరం శివపాథసుందరం కాజా మాట్లాడుతూ శాస్త్రీయ పరిశోధనలను పరిశ్రమల అవసరాలకు అనుసంధానిస్తూ తయారీ రంగానికి అవసరమైన భవిష్యత్‌ ఇంజనీర్లు, పరిశోధకులను తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. పరిశోధన, పరిశ్రమల మధ్య సమన్వయాన్ని పెంచేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందని తెలిపారు.

కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ముఖాముఖి సదస్సులో టాటా స్టీల్‌ లిమిటెడ్‌, విప్రో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇంజనీరింగ్‌, విప్రో హైడ్రాలిక్స్‌, ఎల్‌అండ్‌టీ ప్రెసిషన్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ సిస్టమ్స్‌, ఫ్రంట్‌లైన్‌ టెక్‌సోల్‌, నెక్స్ట్‌జెన్‌ ప్లాస్మా సంస్థల ప్రతినిధులతో పాటు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వెల్డింగ్‌ నిపుణులు పాల్గొన్నారు. పరిశ్రమల్లో నైపుణ్యాల కొరత, భవిష్యత్‌ సాంకేతిక అవసరాలపై విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో లింకన్‌ ఎలక్ట్రిక్‌ ఇండియా ప్రతినిధులు వేణు భారతి, నిపిన్‌ శంకర్‌, డాక్టర్‌ నియాంత్‌ శ్రీధరన్‌తో పాటు ఐఐటీ తిరుపతి మెకానికల్‌ విభాగం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ డి.వి. కిరణ్‌, వివిధ విభాగాల డీన్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.