జోగిపేట సీన్ రిపీట్.. గైర్హాజరు వైద్యులపై మంత్రి ఆగ్రహం
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ: జహీరాబాద్ ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో డ్యూటీ వైద్యులు గైర్హాజరు కావడం, వైద్యుల కొరతతో పాటు డ్యూటీ డాక్టర్ స్థానంలో ప్రైవేట్ వైద్యుడు విధులు నిర్వహించి చికిత్స అందించిన ఘటనపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
‘జోగిపేట సీన్ రిపీట్’ శీర్షికతో ఆంధ్రప్రభ ప్రచురించిన కథనంపై మంత్రి స్పందించారు. జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిలో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించి వివిధ పత్రికల్లో ప్రచురితమైన వార్తా కథనాలపై మంత్రి వివరాలు తెలుసుకున్నారు. ఈ విషయమై సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తో పాటు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డా. క్రిస్టినా జెడ్ చొంగ్తుతో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో చోటుచేసుకున్న పరిణామాలపై పూర్తిస్థాయి విచారణ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
విధుల్లో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదు
ఆస్పత్రిలో డ్యూటీ వైద్యుడు అందుబాటులో లేకపోవడం, ఆయన స్థానంలో ప్రైవేట్ వైద్యుడు విధులు నిర్వహించడం వంటి అంశాలపై మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాల్సిన బాధ్యత వైద్యులు, సిబ్బందిపై ఉందని స్పష్టం చేశారు. డ్యూటీ సమయంలో వైద్యులు గైర్హాజరు కావడం, వారి స్థానంలో ప్రైవేట్ వైద్యులను విధుల్లో ఉంచడం వంటి పరిణామాలను ఏమాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని, విచారణలో బాధ్యులుగా తేలిన వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల హాజరు, విధుల నిర్వహణపై పటిష్టమైన పర్యవేక్షణ చేపట్టాలని అధికారులకు సూచించారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన వైద్య సేవలు నిరంతరం అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు.
