ఉపాధి కల్పన కార్యాలయంలో 22న జాబ్ మేళా

  • 55 ఉద్యోగాల భర్తీకి అవకాశం.. రూ.12,500 నుంచి రూ.25 వేల వరకు వేతనం

భూపాలపల్లి, ఆంధ్రప్రభ: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఈ నెల 22న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి మానుపాటి మల్లయ్య తెలిపారు. కలెక్టరేట్‌లోని ఎఫ్‌-3 బ్లాక్‌లో ఉన్న జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వివిధ కంపెనీల్లో సుమారు 55 ఉద్యోగాల భర్తీకి అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని తెలిపారు.

18 నుంచి 35 సంవత్సరాల వయసు గల యువతీ యువకులు ఈ జాబ్ మేళాకు హాజరు కావచ్చని తెలిపారు. ఫార్మసిస్ట్, ఫార్మసీ అసిస్టెంట్, అప్రెంటిస్‌షిప్ తదితర ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. అప్రెంటిస్‌షిప్ పోస్టులకు యువకులకు మాత్రమే అవకాశం ఉంటుందని తెలిపారు. ఉద్యోగాన్ని బట్టి నెలకు రూ.12,500 నుంచి రూ.25 వేల వరకు వేతనం ఉంటుందని, ఎంపికైన వారు భూపాలపల్లి, హైదరాబాద్‌లో పనిచేయాల్సి ఉంటుందని వివరించారు.

అర్హత, ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు తమ విద్యార్హతల ధ్రువపత్రాల జిరాక్స్ కాపీలతో ఈ నెల 22న ఉదయం 11 గంటలకు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో జరిగే జాబ్ మేళాకు హాజరు కావాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి కోరారు. మరిన్ని వివరాలకు 9502468800 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.