విజయవాడ – ఆంధ్రప్రభ – ముంబై నటి జిత్వానిపై వేధింపుల కేసులో ఐపీఎస్ అధికారులు కాంతి రాణా టాటా, విశాల్ గున్నికి సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో మే 5 వ తేదీన జరిగే విచారణకు హాజరుకావాలని జారీ చేసిన నోటీసుల్లో సీఐడీ స్పష్టం చేసింది. ఇంటెలిజెన్స్ మాజీ బాస్ పీఎస్ఆర్ ఆంజనేయులను సీఐడీ విచారణలో చెప్పిన ఆంశాలపై ఈ ఇరువురు అధికారులను సీఐడీ ప్రశ్నించనుంది. అయితే గతంలో విశాల్ గున్ని ఇచ్చిన స్టేట్మెంట్లోని అంశాలు నిజం కాదని పీఎస్ఆర్ ఆంజనేయులు చెప్పినట్లు సమాచారం. ఇక గతంలో విశాల్ గున్నిని సీఐడీ విచారించింది.
ఈ సందర్బంగా జత్వానీ కేసులో తనను అప్పటి ఇంటెలిజెన్స్ హెడ్‌గా ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులు పిలిస్తేనే తాను వెళ్లానని తెలిపారు. అందులోభాగంగానే నటి జిత్వానీని ముంబై నుంచి అరెస్ట్ చేసి తీసుకురావాలనే టాస్క్‌ను తనకు ఆయన అప్పగించారని చెప్పారు. మరోవైపు విశాల్ గున్నీతో తాను నిఘాకు సంబంధించి అంశాలు మాత్రమే మాట్లాడి ఉంటానని సీఐడీ విచారణలో పీఎస్ఆర్ ఆంజనేయులు పేర్కొన్నారు. అలాగే తాను ఈ అంశంపై కాంతి రాణాతో సైతం మాట్లాడలేదని ఈ విచారణలో అధికారుల ఎదుట స్పష్టం చేశారు. ఈ కేసులో గతంలో కాంతిరాణా, విశాల్ గన్నీలను సీఐడీ అధికారులు విచారించారు. ఈ సందర్భంగా ఆ అధికారులు.. తాజాగా పీఎస్ఆర్ ఆంజనేయులును విచారించారు. ఈ సందర్భంగా ఈ ఇద్దరు చెప్పిన సమాధానాలకు, పీఎస్ఆర్ ఆంజనేయులు చెప్పిన జవాబులకు ఎక్కడ పొంతన కుదరడం లేదని సీఐడీ అధికారులు భావించారు. ఈ నేపథ్యంలో ఈ ఇరువురు అధికారులను మళ్లీ పిలిచి విచారించాలని వారు నిర్ణయించారు. దీంతో వారికి మరోసారి నోటీసులు జారీ చేశారు.