Jantar Mantar protest Delhi | సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్.. భారీగా నిరసనకారుల అరెస్టు
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శుక్రవారం చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. అఖిల భారత విద్యార్థి సంఘం (ఐసా) జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా, సామాజిక కార్యకర్తలు, విద్యార్థి సంఘాల నేతల పిలుపుతో పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు జంతర్ మంతర్ వైపు చేరుకున్నారు.
ఎన్నికల సంఘం పనితీరు, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)పై ఆందోళనకారులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఓటర్ల హక్కులకు సంబంధించిన అంశాలపై ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని, సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు అక్టోబర్ 2న జంతర్ మంతర్ వద్ద నిరసనకు పిలుపునిచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు.
అనుమతి లేదంటూ పోలీసుల అడ్డంకులు
నిరసనకు ఢిల్లీ పోలీసులు అనుమతి ఇవ్వలేదని అధికారులు ముందుగానే స్పష్టం చేశారు. దీంతో జంతర్ మంతర్‌కు వెళ్లే మార్గాల్లో భారీగా బారికేడ్లు ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. పార్లమెంట్ స్ట్రీట్, జనపథ్, టాల్స్టాయ్ మార్గాలతో పాటు పరిసర ప్రాంతాల్లో పోలీసు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను మోహరించారు.
నేహా బోరా సహా పలువురు అదుపులోకి…
పోలీసుల ఆంక్షలను దాటి నిరసనకు ప్రయత్నించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐసా అధ్యక్షురాలు నేహా బోరాతో పాటు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఆతిశీ, ఆప్ నేతలు, సామాజిక కార్యకర్తలు తదితరులు పోలీసుల నిర్బంధానికి గురయ్యారు. మధ్యాహ్నానికి 500 మందికిపైగా, కొన్ని నివేదికల ప్రకారం 700 మందికిపైగా నిరసనకారులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
పోలీసులు నిరసనకారులను బస్సుల్లో తరలిస్తుండగా కొన్ని ప్రాంతాల్లో ఇతర ఆందోళనకారులు, మద్దతుదారులు వాహనాలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దించారు.
