Janhvi Kapoor | అమ్మ ఐకానిక్‌ ‘నాగిన’ గెటప్‌లో జాన్వీ కపూర్‌!

ఆంధ్రప్రభ, సినిమా ప్రతినిధి: దివంగత నటి శ్రీదేవి నటన, ఆమె తెరపై సృష్టించిన పాత్రలు ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయాయి. ముఖ్యంగా ‘నాగిన’ సినిమాలో ఆమె పోషించిన పాత్ర ఎంతో ప్రత్యేకం. ఇప్పుడు ఆ సినిమా జ్ఞాపకాలను శ్రీదేవి కుమార్తె, నటి జాన్వీ కపూర్‌ మరోసారి గుర్తుచేశారు. ఈ ఏడాది హాలోవీన్‌ వేడుకల కోసం తన తల్లి అప్పట్లో ధరించిన నాగిన రూపాన్ని అనుకరించారు. జాన్వీ శ్రీదేవిలా కనిపించగా, సోషల్‌ మీడియా ప్రముఖుడు ఓరీ.. రిషి కపూర్‌ పాత్రలో కనిపించారు. వీరిద్దరి ఫొటోలు ఇప్పుడు నెట్టింట సందడి చేస్తున్నాయి.

సినిమా పోస్టర్‌ తరహాలో ఫొటోషూట్‌ చేయడంతో పాటు, షూటింగ్‌ సమయంలో తీసిన కొన్ని దృశ్యాలను కూడా జాన్వీ పంచుకున్నారు. ఈ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ.. సినిమా చరిత్రలో నిలిచిపోయిన ఓ అద్భుతమైన సన్నివేశాన్ని మళ్లీ ఆవిష్కరించాలనుకున్నానని పేర్కొన్నారు.

హాలోవీన్‌ వేడుకల్లో మనకు నచ్చిన సినిమా పాత్రలు, ప్రముఖ వ్యక్తుల రూపాలను అనుకరించడం ఆనవాయితీగా మారిందని జాన్వీ చెప్పారు. కొన్నిసార్లు ఇవి సరదాగా ఉంటాయని, మరికొన్నిసార్లు మనసుకు దగ్గరైన వారికి ఇచ్చే నివాళిగా నిలుస్తాయని రాసుకొచ్చారు. తన తల్లి శ్రీదేవి, రిషి కపూర్‌, అమ్రిష్‌ పురి వంటి గొప్ప నటుల కంటే ప్రత్యేకమైన వ్యక్తులు ఎవరుంటారని భావోద్వేగంగా పేర్కొన్నారు.

‘హాలోవీన్‌ విన్నర్‌ నువ్వే’.. ఖుషీ కామెంట్‌

జాన్వీ షేర్‌ చేసిన ఫొటోలపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె సోదరి ఖుషీ కపూర్‌ కూడా స్పందించారు. ‘ఈ హాలోవీన్‌లో నువ్వే విజేత’ అంటూ కామెంట్‌ చేశారు. దీంతో ఈ ఫొటోలు మరింతగా వైరల్‌ అవుతున్నాయి.

1986 నవంబర్‌ 28న విడుదలైన ‘నాగిన’ చిత్రానికి హర్మేష్‌ మల్హోత్రా దర్శకత్వం వహించడంతో పాటు నిర్మించారు. ఈస్టర్న్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాకు రవి కపూర్‌ స్క్రీన్‌ప్లే అందించగా, జగ్‌మోహన్‌ కపూర్‌ కథను అందించారు.ఈ సినిమాలో శ్రీదేవి రజనీ అనే నాగిన పాత్రలో నటించారు. తన భర్త మరణానికి కారణమైన దుష్ట మాంత్రికుడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు రాజీవ్‌ (రిషి కపూర్‌)ను వివాహం చేసుకుంటుంది. ఈ కథలో శ్రీదేవి నటన, ఆమె రూపం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.