హైదరాబాద్, ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (JubileeHills ByElection) అక్టోబర్ చివరి వారం గానీ, నవంబర్ మొదటి వారంలో గానీ ఉంటుందని, ఈ ఎన్నికల్లో మెజార్టీతో తమ పార్టీ అభ్యర్థి గెలవాలని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) అన్నారు. తెలంగాణ భవన్‌లో జూబ్లీహిల్స్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… ఇక్కడ నుంచే జైత్రయాత్ర ప్రారంభం కావాలని అన్నారు. మాగంటి సునీతకు అందరి ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నామన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భారీ మెజార్టీతో పార్టీని గెలిపించడమే గోపీనాడు సరైన నివాళి అని పేర్కొన్నారు.
ఓటుకు రూ.5 వేలు పంచితే గెలుస్తామని కాంగ్రెస్ నేతలు (Congress leaders) అనుకుంటున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. సీఎం సోదరుడు చెరువులో ఇళ్లు కట్టినా హైడ్రా వెళ్లదని.. కానీ పేదల బస్తీలకు వెళ్లి ఇళ్లు కూలగొడతారని విమర్శించారు. “ఉపఎన్నిక కోసం సర్వేలు చేయిస్తున్నాం.. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి బాగుంది. కొన్ని బస్తీల్లో వెనకంజ లో ఉన్నాం. అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీ గెలుపు (party victory) కోసం కృషి చేయాలి. ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లు ఉంటే తొలగించాలి.. లేనివారివి చేర్చాలి. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో సత్తా చూపాలి” అని కేటీఆర్ అన్నారు.
మాగంటి సునీత (Maganti Sunitha) మాట్లాడుతూ… తన భర్త దివంగత గోపీనాథ్ లాగే తనకూ అండగా ఉండాలని కోరారు. గోపీనాథ్ ఆశయాలను నెరవేర్చేందుకు అందరమూ కలిసి పనిచేద్దామన్నారు. భారత రాష్ట్ర సమితిలో కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు ఉందని మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పార్టీని భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్, దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత పాల్గొన్నారు.