రాజీతో కేసులను పరిష్కరించుకోండి
రాజీతో కేసులను పరిష్కరించుకోండి
ఈ నెల 20న జాతీయ మెగా లోక్ అదాలత్
జగిత్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ: ఈ నెల 20న నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. రాజీ పడదగిన కేసులను పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
మంగళవారం ఎస్పీ మాట్లాడుతూ.. లోక్ అదాలత్లో క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ వివాదాలు, ఆస్తి విభజన కేసులు, కుటుంబ నిర్వహణకు సంబంధించిన కేసులు, వైవాహిక వివాదాలు, బ్యాంకు రికవరీ కేసులు, విద్యుత్ చౌర్యం కేసులు, చెక్ బౌన్స్ కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, చిన్నచిన్న పెట్టీ కేసులు తదితర రాజీ పడదగిన కేసులను సులభంగా పరిష్కరించుకునే అవకాశం కల్పించబడుతుందని తెలిపారు.
‘రాజీ మార్గమే రాజమార్గం’ అనే భావనతో న్యాయ వ్యవస్థ కల్పించిన ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. జిల్లా పోలీస్ అధికారులు, కోర్టు విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది, ఇతర అధికారులు రాజీ పడదగిన కేసులను గుర్తించి, ఇరువర్గాల వారికి కౌన్సెలింగ్ నిర్వహించడం ద్వారా రాజీ కుదిరేలా అవగాహన కల్పిస్తారని చెప్పారు.
తమ కేసులను పరస్పర రాజీ ద్వారా పరిష్కరించుకోవాలని భావించే వారు సంబంధిత పోలీస్ అధికారులను సంప్రదించాలని ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు.
