తెలుగు భాషా సేవకు ఘన వీడ్కోలు
పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయుడు చీకోటి శ్రీనివాస్‌కు ఘన సన్మానం
రేగొండ, ఆంధ్రప్రభ : తెలుగు భాషా కోవిదుడిగా, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతగా విశిష్ట సేవలందించిన జగ్గయ్యపేట ఉన్నత పాఠశాల సహాయ ఉపాధ్యాయుడు చీకోటి శ్రీనివాస్ పదవీ విరమణ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఓంటేటి చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ నడిపెల్లి శాంతాదేవి–వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరై శ్రీనివాస్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల్లో తెలుగు భాషపై ఆసక్తిని పెంపొందించడంలో చీకోటి శ్రీనివాస్ చేసిన కృషి అభినందనీయమని అన్నారు.
ఉపాధ్యాయ వృత్తిని కేవలం ఉద్యోగంగా కాకుండా బాధ్యతగా భావించి ఎంతోమంది విద్యార్థులకు మార్గదర్శకత్వం అందించారని కొనియాడారు. తెలుగు భాషపై అపారమైన పట్టు కలిగిన శ్రీనివాస్ సందర్భానుసారంగా చక్కగా, శుద్ధమైన తెలుగులో మాట్లాడటం ద్వారా విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారని పలువురు పేర్కొన్నారు.
ఆయన అందించిన విద్యా సేవలు, తెలుగు భాషాభివృద్ధికి చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. పదవీ విరమణ అనంతరం శ్రీనివాస్ ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తూ సమాజానికి మరింత సేవ చేయాలని పలువురు ఆకాంక్షించారు.
కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, సహచర ఉపాధ్యాయులు, విద్యార్థులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, బంధుమిత్రులు, తల్లిదండ్రులు, గ్రామ ప్రముఖులు తదితరులు పాల్గొని చీకోటి శ్రీనివాస్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన అతిథులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, బంధుమిత్రులకు విందు భోజనం ఏర్పాటు చేశారు.
