ఎన్నికలొస్తే అరాచకాలే… ఇదే జగన్ విధానం !!

  • జగన్‌లో ఓటమి భయం
  • వైకాపా హయాంలో పంచాయతీలు నిర్వీర్యం..
  • ఎన్డీయే పాల‌న‌లో దౌర్జన్యాలకు తావులేదు..
  • స్థానిక ఎన్నికల్లో ఎన్డీయే ఘన విజయం ఖాయం..
  • ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఎన్నికలను ఎదుర్కొంటాం : ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు

విజయనగరం, ఆంధ్ర‌ప్ర‌భ : స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన వెలువడిన వెంటనే వైకాపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో ఓటమి భయం బయటపడుతోందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. తాడేపల్లిలో ఇటీవల నిర్వహించిన సమావేశంలో జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయనలోని నిరాశ, నిస్పృహలకు అద్దం పడుతున్నాయని అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కలిశెట్టి మాట్లాడుతూ.. రాజకీయ అంశాలపై స్పందించారు.

గతంలో అధికారంలో ఉన్న సమయంలో ఏకగ్రీవ ఎన్నికలను ప్రోత్సహిస్తామంటూ స్వయంగా జీవో జారీ చేసిన జగన్, ఆ సమయంలో పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి టీడీపీ అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేశారని కలిశెట్టి ఆరోపించారు. నామినేషన్ పత్రాలు చింపివేయడం, అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేయడం వంటి ఘటనలతో ఏకగ్రీవాలు చేయించుకున్నారని విమర్శించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు ప్రత్యేక నిధులు ఇస్తామని హామీ ఇచ్చి, తర్వాత ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని అప్పటి వైకాపా సర్పంచులే చెబుతున్నారని కలిశెట్టి పేర్కొన్నారు.

అధికారంలో ఉన్నప్పుడు ఏకగ్రీవాలు జరగకపోతే టికెట్లు ఇవ్వబోమని చెప్పిన జగన్, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకపోతే భవిష్యత్తులో సీట్లు ఇవ్వబోమంటూ వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందని ఎంపీ కలిశెట్టి మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థను తన చేతుల్లోనే పెట్టుకున్నట్లుగా వ్యవహరించడం సరికాదన్నారు. ఎన్నికల్లో ఎవరిని గెలిపించాలన్నది ప్రజల హక్కు, వారి నిర్ణయమే అంతిమమని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు నుంచైనా జగన్ పాఠాలు నేర్చుకోవాలని సూచించారు.

వైకాపా హయాంలో జరిగినట్లు దౌర్జన్యాలు, బెదిరింపులకు ఎన్డీయే కూటమిలో చోటు ఉండదని కలిశెట్టి అన్నారు. పూర్తిస్థాయి ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఎన్నికలను ఎదుర్కొంటామని తెలిపారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, పార్టీ నాయకత్వం సూచనల మేరకు క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయాన్ని సేకరించి, ప్రజల ఆదరణ ఉన్న అభ్యర్థులకే టికెట్లు కేటాయిస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, డ్రైనేజీ కాలువల నిర్మాణంతో పాటు మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పన వేగంగా జరుగుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసం కారణంగానే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులకు భారీ మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

2014 నుంచి 2019 వరకు టీడీపీ పాలనలో సుమారు 25 వేల కిలోమీటర్ల మేర రహదారులు, డ్రైనేజీ కాలువల నిర్మాణం జరిగిందని కలిశెట్టి తెలిపారు. అయితే 2019 నుంచి 2024 వరకు వైకాపా పాలనలో కేవలం 1,800 కిలోమీటర్ల మేర మాత్రమే పనులు జరిగాయని ఆరోపించారు. కనీసం రహదారులపై గుంతలను కూడా పూడ్చలేని పరిస్థితిలో గత ప్రభుత్వం రాష్ట్రాన్ని వదిలేసిందని విమర్శించారు.

ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రివర్గం సమష్టి నాయకత్వంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రెండేళ్ల వ్యవధిలోనే దాదాపు నాలుగు వేల కిలోమీటర్లకు పైగా రహదారుల నిర్మాణం పూర్తి చేసి గ్రామీణాభివృద్ధికి కొత్త ఊపునిచ్చామని తెలిపారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించిన ఆయన, కూటమి ప్రభుత్వం మాత్రం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీ మేరకు పింఛను మొత్తాన్ని రూ.వెయ్యి పెంచిందని గుర్తుచేశారు.

ప్రతి నెలా ఒకటో తేదీనే లబ్ధిదారుల ఇంటి వద్దకు పింఛను అందించే విధానంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ విజయనగరం పర్యటనకు మహిళలు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఘన స్వాగతం పలికారని అన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలపై ప్రజల్లో ఉన్న నమ్మకానికి ఈ స్పందన నిదర్శనమని తెలిపారు. రానున్న విజయనగరం నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూడా ఎన్డీయే కూటమి ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

పులివెందుల ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నప్పటికీ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా తాడేపల్లికే పరిమితమై మీడియా సమావేశాల ద్వారా ఆరోపణలు చేయడం జగన్‌కే చెల్లిందని కలిశెట్టి ఎద్దేవా చేశారు. దేశంలోనే అత్యంత సీనియర్ ముఖ్యమంత్రుల్లో ఒకరైన చంద్రబాబు నాయుడిపై అనుచితమైన భాషలో విమర్శలు చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. జగన్ ఎక్కువ సమయం బెంగళూరులో గడుపుతూ, అప్పుడప్పుడు తాడేపల్లికి వచ్చి ప్రజలను అయోమయంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

దౌర్జన్యాలు, బెదిరింపులకు తావులేని ప్రజాస్వామ్య పాలన అందించడమే తెలుగుదేశం పార్టీ, ఎన్డీయే కూటమి ప్రధాన విధానమని ఆయన స్పష్టం చేశారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా రాబోయే 15 ఏళ్ల పాటు ఎన్డీయే కూటమి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. వార్డు సభ్యుడి స్థాయి నుంచి పార్లమెంట్ వరకు ప్రజలు ఎన్డీయే పక్షాన నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

గత ఐదేళ్ల వైకాపా పాలనలో స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులను దారి మళ్లించి పంచాయతీలను నిర్వీర్యం చేశారని కలిశెట్టి ఆరోపించారు. దీంతో గ్రామాల్లో కనీసం వీధి దీపాల ఏర్పాటు, కాలువల శుభ్రత వంటి పనులు కూడా సక్రమంగా జరగలేదని విమర్శించారు. అలాంటి పరిస్థితులకు కారణమైన జగన్ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని నాయకులకు సూచించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, అధికారం కోల్పోయిన తర్వాత మరో విధంగా మాట్లాడటం జగన్ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.

తాడేపల్లి నివాసం నుంచి నిర్వహించే మీడియా సమావేశాలు, అక్కడి నుంచి తీసుకునే రాజకీయ నిర్ణయాలు ప్రజలను ఆకట్టుకోలేకపోతున్నాయని కలిశెట్టి అన్నారు. సొంత పార్టీ నాయకులే తమ రాజకీయ భవిష్యత్తుపై అయోమయంలో ఉన్నారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో జగన్ రాజకీయంగా బెంగళూరుకే పరిమితం కావాల్సిన పరిస్థితి వస్తుందని విమర్శించారు.

ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంపై వారు సానుకూలంగా స్పందించారని ఎంపీ తెలిపారు. గత ఐదేళ్లలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందని, చంద్రబాబు నాయుడు తన అనుభవం, దార్శనికతతో కేవలం రెండేళ్లలోనే రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి మార్గంలో నడిపిస్తున్నారని కేంద్ర నాయకులు ప్రశంసిస్తున్నట్లు చెప్పారు.

ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమష్టి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. బీసీలపై జగన్ మొసలికన్నీరు కారుస్తున్నారని, గత ప్రభుత్వ హయాంలో వారిని అణచివేసే ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నెముకలాంటి వారని, వారికి అత్యున్నత గౌరవం, రాజకీయ ప్రాధాన్యత కల్పించిన నాయకుడు చంద్రబాబు నాయుడేనని స్పష్టం చేశారు.

బీసీలకు, టీడీపీకి మధ్య ఉన్న భావోద్వేగ బంధాన్ని ఎవరూ విడదీయలేరని అన్నారు. గ్రామ స్థాయి నుంచి కార్పొరేషన్ల వరకు ఏ ఎన్నికలు జరిగినా పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహిస్తామని తెలిపారు. ప్రజల ఆశీస్సులతో అన్ని ఎన్నికల్లోనూ ఎన్డీయే కూటమి అభ్యర్థులే భారీ మెజారిటీతో గెలుస్తారని కలిశెట్టి ధీమా వ్యక్తం చేశారు. కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా మహిళలు, యువత, అన్ని వర్గాల ప్రజలు కూటమి ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతున్నారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు.