జగన్‌కు క్రెడిట్ జబ్బు!
ఇతరుల పనులపై జగన్ కన్ను..
అభివృద్ధి పనులపై జగన్ క్రెడిట్ గేమ్
ఇతరుల పనులకు క్రెడిట్ తీసుకునే జబ్బు ముదిరిందన్న మంత్రి సంధ్యారాణి
ఉదయం విమర్శలు.. సాయంత్రానికి తన ఘనతగా ప్రచారం
అమరావతి, ఆంధ్రప్రభ: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తీవ్ర విమర్శలు చేశారు. ఇతరులు చేపట్టిన పనులకు కూడా తన ఖాతాలో క్రెడిట్ వేసుకునే జబ్బు జగన్‌కు ముదిరిపోయిందని ఎద్దేవా చేశారు. ఈ వ్యాధికి వైద్యం చేసే డాక్టర్ కూడా లేరని, దీనికి తొలి బాధితుడు జగన్‌మోహన్‌రెడ్డేనని వ్యాఖ్యానించారు.
కూటమి ప్రభుత్వం చేపట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమంపైనా జగన్ ఉదయం అవినీతి ఆరోపణలు చేస్తున్నారని సంధ్యారాణి విమర్శించారు. అదే పనిని సాయంత్రానికి తన ఘనతగా చెప్పుకోవడం ఆయనకు అలవాటుగా మారిందని ఆరోపించారు. జగన్ తన మాట్లాడే తీరును మార్చుకోవాలని, లేదంటే మందుల మోతాదు పెంచుకోవాల్సి వస్తుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
వెలిగొండ ప్రాజెక్టు, అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం, గూగుల్ ప్రాజెక్టు తదితర అభివృద్ధి కార్యక్రమాలను కూడా జగన్ తన ఖాతాలో వేసుకుంటున్నారని మంత్రి ఆరోపించారు. ప్రతి అభివృద్ధి కార్యక్రమం తన వల్లే జరిగిందన్నట్లుగా జగన్ చెప్పుకోవడంపై ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టడం, తాకట్టు పెట్టడం, ధ్వంసం చేయడమే ఆయన ఘనత అని సంధ్యారాణి విమర్శించారు. జగన్ చెప్పుకునే ఇలాంటి ఘనతలు కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం అవసరం లేదని స్పష్టం చేశారు.జగన్ బాధ్యతారహితంగా చేస్తున్న వ్యాఖ్యల వల్ల రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతింటోందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా కాకుండా వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని సూచించారు.
