బీసీలకు ఎప్పుడు టీడీపీ అండ..

వైసీపీకి మాట్లాడే హక్కు లేదు
నాడు రిజర్వేషన్లు తగ్గించిన జగన్‌..
బీసీలను రాజకీయ, ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దుతున్న చంద్రబాబు
బీసీలకు ఎవరేం చేశారో బహిరంగ చర్చకు సిద్ధం
స్థానిక ఎన్నికలు వస్తున్నాయని ఇప్పుడు బీసీలు గుర్తొచ్చారా?
వైసీపీ ఉచ్చులో బీసీలు పడరు
టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న

భవానిపురం, ఆంధ్రప్రభ : బీసీలకు న్యాయం చేయడంలో తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయం లేదని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న అన్నారు. బీసీలంటే టీడీపీ.. టీడీపీ అంటే బీసీలు అనే అనుబంధం దశాబ్దాలుగా కొనసాగుతోందని పేర్కొన్నారు. బీసీల గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదని, అధికారంలో ఉన్నప్పుడు బీసీల రిజర్వేషన్లను తగ్గించిన జగన్‌ ఇప్పుడు ఏం చేశానని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.

బీసీల రిజర్వేషన్లు ఎందుకు తగ్గించారు?..

బీసీలకు ఏదో చేశామని జగన్‌ చెప్పుకునే ముందు.. తన హయాంలో బీసీల రిజర్వేషన్‌ శాతం ఎందుకు తగ్గించారో సమాధానం చెప్పాలని బుద్దా వెంకన్న డిమాండ్‌ చేశారు. బీసీ నేతలుగా చెప్పుకునే వారు అప్పట్లో జగన్‌ను ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనే వైసీపీ నేతలకు బీసీలు గుర్తుకొచ్చారని విమర్శించారు. రాష్ట్రంలో బీసీలను గుర్తించి రాజకీయంగా ప్రోత్సహించింది ఎన్టీఆర్‌ అని, ఆ తర్వాత అదే విధానాన్ని చంద్రబాబు కొనసాగించారని బుద్దా వెంకన్న అన్నారు.

చంద్రబాబు నాయకత్వంలో బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగేలా అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. బీసీలకు కేవలం పదవులు ఇవ్వడం కాకుండా వారు స్వయం సమృద్ధి సాధించేలా రుణాలు, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ధర్మాన ప్రసాదరావు సీనియర్‌ నేత కావడంతో ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చామని చెప్పుకోవడం ద్వారా బీసీలందరికీ న్యాయం చేసినట్లు కాదని బుద్దా వెంకన్న అన్నారు. ధర్మాన సోదరులకు పదవులు దక్కితే రాష్ట్రంలోని బీసీలందరికీ ప్రయోజనం కలిగినట్లుగా ప్రచారం చేయడం సరికాదన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరు బీసీలకు రెండేళ్లలోనే రాజ్యసభ పదవులు ఇచ్చామని పేర్కొన్నారు. బీసీల ఆత్మగౌరవంతో పాటు ఆర్థిక స్వావలంబనకు ప్రాధాన్యం ఇవ్వాలని బుద్దా వెంకన్న అన్నారు. రాష్ట్రంలో వేలాది మంది చేతివృత్తులపై ఆధారపడి జీవిస్తున్నారని, వారికి ఆధునిక పనిముట్లు, రుణాలు, మార్కెటింగ్‌ సదుపాయాలు కల్పించాలని చెప్పారు. ఒక్క కుటుంబానికి పదవి లేదా ప్రయోజనం కల్పించి బీసీలందరికీ న్యాయం చేసినట్లు చెప్పడం సరికాదన్నారు.

బహిరంగ చర్చకు సిద్ధం..

బీసీలకు వైసీపీ ఏం చేసిందో.. చంద్రబాబు ఏం చేశారో బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని బుద్దా వెంకన్న సవాల్‌ చేశారు. జగన్‌గానీ, ధర్మానగానీ ఎవరైనా చర్చకు రావచ్చన్నారు. బీసీల వద్దకు ఏ ముఖం పెట్టుకుని వెళతారని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో బీసీలు ఎదుర్కొన్న ఇబ్బందులను వారు మరచిపోలేదని వ్యాఖ్యానించారు. జగన్‌కు విభజించి పాలించడం రాజకీయ విద్యగా మారిందని బుద్దా వెంకన్న ఆరోపించారు. గతంలో కాపుల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించారని, ఇప్పుడు బీసీలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

జగన్‌ ఉచ్చులో బీసీలు పడరని, కులాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలను ప్రజలు తిరస్కరిస్తారని అన్నారు. బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించవద్దని హెచ్చరించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బీసీలను అడ్డం పెట్టుకోవాలని వైసీపీ చూస్తోందని బుద్దా వెంకన్న ఆరోపించారు. జగన్‌ కార్యాలయంలో కులాల సమావేశాలు పెట్టి వర్గాల మధ్య విభేదాలు రెచ్చగొట్టడం సరైన విధానం కాదన్నారు. బీసీలను రాజకీయ, ఆర్థిక శక్తిగా ఎదిగేలా చేయడమే చంద్రబాబు లక్ష్యమని చెప్పారు.

బీసీలకు పదవులు ఇచ్చి తమ చెప్పుచేతల్లో పనిచేయాలని ఆదేశించే విధానం టీడీపీలో లేదని బుద్దా వెంకన్న అన్నారు. వైసీపీ తరఫున రాజ్యసభకు వెళ్లిన నలుగురిలో ముగ్గురు బయటకు రావడానికి కారణం అక్కడి రాజకీయ పరిస్థితులేనని పేర్కొన్నారు. ఆర్‌.కృష్ణయ్య వంటి బీసీ నేతలు సైతం అక్కడ ఇమడలేకపోయారంటే జగన్‌ వ్యవహారశైలి ఏంటో అర్థం చేసుకోవచ్చన్నారు. బీసీలు ఎదగాలన్నా.. రాజకీయంగా నిలదొక్కుకోవాలన్నా టీడీపీతోనే సాధ్యమనే విషయం వారికి తెలుసన్నారు.