పారిశుద్ధ్య కార్మికులను గౌరవించుకోవడం మన బాధ్యత

జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ

భీమవరం,ఆంధ్రప్రభ: పారిశుద్ధ్య కార్మికులు, స్వచ్ఛంద సేవకులను గౌరవించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ అన్నారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర అవార్డ్స్–2026లో భాగంగా శుక్రవారం భీమవరం త్యాగరాజ భవన్‌లో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

69 మందికి అవార్డులు

జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛత, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, పారిశుద్ధ్య నిర్వహణతో పాటు ప్రజల్లో స్వచ్ఛతపై అవగాహన కల్పించడంలో విశేష కృషి చేసిన 69 మందిని జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఘనంగా సన్మానించి అవార్డులను ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. స్వచ్ఛత, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణలో విశేష కృషి చేసిన వారిని గుర్తించి ప్రోత్సహించడమే స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ప్రజల్లోనూ స్వచ్ఛతపై చైతన్యం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. పరిశుభ్రతతో పాటు పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

గాంధీజీ ఆశయాలు స్ఫూర్తిదాయకం

మహాత్మా గాంధీ తత్వం ఎంతో గొప్పదని, దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని జాయింట్ కలెక్టర్ అన్నారు. దశాబ్దాల క్రితమే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అహింసా మార్గంలో జీవించాలని గాంధీజీ సూచించారని గుర్తు చేశారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కోరారు.

భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో స్వచ్ఛత కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించి పరిశుభ్రమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.

పారిశుద్ధ్య కార్మికుల సేవలు కీలకం

ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ.. గాంధీ జయంతి సందర్భంగా స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర అవార్డ్స్–2026 కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. పారిశుద్ధ్య కార్మికులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి సేవలను గుర్తించి సత్కరించుకోవడం మన బాధ్యత అని పేర్కొన్నారు. అవార్డులకు ఎంపికైన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు.

ప్లాస్టిక్ కవర్లలో చెత్తను వేసి బహిరంగ ప్రదేశాల్లో పడేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. పర్యావరణంలో వస్తున్న మార్పులకు ప్లాస్టిక్ వినియోగం, కాలుష్యం కూడా కారణమవుతున్నాయని పేర్కొంటూ.. ప్రజలంతా చైతన్యవంతులై పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేయాలని కోరారు.

స్వచ్ఛత కేవలం ప్రభుత్వ శాఖల బాధ్యత మాత్రమే కాదని, ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్రమైన సమాజాన్ని నిర్మించగలమని ఎమ్మెల్యే అన్నారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పారిశుద్ధ్య కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో మాజీ మంత్రి, వినియోగదారుల రక్షణ మండలి చైర్‌పర్సన్ పీతల సుజాత, భీమవరం ఏఎంసీ చైర్‌పర్సన్ కలిదిండి సుజాత, డీఆర్వో పి. గ్లోరియా, డీపీఓ దోసిరెడ్డి, భీమవరం కమిషనర్ రామచంద్రారెడ్డి, అల్లూరి సీతారామరాజు సేవాసమితి చైర్మన్ కంతేటి వెంకటరాజు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, అవార్డు గ్రహీతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.