ISRO NVS-03 Satellite Launch | అణు గడియారంతో ఇస్రో కీలక ప్రయోగం!

  • నావిక్‌ వ్యవస్థకు మరింత బలం
  • NVS-03 ఉపగ్రహంలో స్వదేశీ అటామిక్ క్లాక్‌
  • రాత్రి 11.51 గంటలకు GSLV-F18 రాకెట్‌ ప్రయోగం

అంతరిక్షంలో ఇస్రో మరో చారిత్రాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. నేడు నింగిలోకి దూసుకెళ్లనున్న NVS-03 ఉపగ్రహం కేవలం నావిగేషన్‌కే కాదు, దేశంలో కొత్తగా అమలవుతున్న ‘ఒకే దేశం.. ఒకే సమయం’ (One Nation, One Time) టెక్నాలజీకి కూడా వెన్నెముకగా నిలవనుంది. ఈ ఉపగ్రహంలోని అత్యాధునిక స్వదేశీ అటామిక్ క్లాక్… బ్యాంకింగ్, మొబైల్ నెట్‌వర్క్‌లు, డిజిటల్ పేమెంట్స్ వంటి రంగాలకు మిల్లీసెకన్ల తేడా కూడా లేకుండా అత్యంత కచ్చితమైన సమయాన్ని అందించనుంది.

శ్రీహరికోట, ఆంధ్రప్రభ వెబ్‌: అంతరిక్ష రంగంలో భారత్‌ మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. దేశానికి సొంతంగా ఉన్న నావిగేషన్‌ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఎన్‌వీఎస్‌ – 03 (NVS-03) ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. ఈ ఉపగ్రహంలో భారత్‌లోనే తయారు చేసిన రుబీడియం అటామిక్ క్లాక్‌ను అమర్చారు. శుక్రవారం రాత్రి 11.51 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌18 రాకెట్‌ ద్వారా దీన్ని అంతరిక్షంలోకి పంపనున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే భారత నావిక్‌ వ్యవస్థకు మరింత బలం చేకూరనుంది.

అంతరిక్షంలోకి సొంత అణు గడియారం!

ఈ ప్రయోగంలో అందరినీ ఆకట్టుకుంటున్నది ఎన్‌వీఎస్‌ – 03 ఉపగ్రహంలోని అటామిక్ క్లాక్‌. సాధారణ గడియారాలు క్వార్ట్జ్‌ క్రిస్టల్‌ సాయంతో సమయాన్ని చూపిస్తాయి. కానీ అటామిక్ క్లాక్‌లు పరమాణువుల సహజ లక్షణాలను ఉపయోగించి సమయాన్ని లెక్కిస్తాయి. అందుకే సాధారణ గడియారాల కంటే ఇవి చాలా కచ్చితంగా సమయాన్ని చూపిస్తాయి.

ఎన్‌వీఎస్‌ – 03 ఉపగ్రహంలో పలు అటామిక్ క్లాక్‌లను అమర్చారు. వీటిలో ఒకటి భారత్‌లోనే తయారు చేసిన రుబీడియం అటామిక్ క్లాక్‌. మిగిలిన గడియారాలను ఇతర ప్రాంతాల నుంచి సేకరించారు. ఇప్పటివరకు ఇలాంటి గడియారాల కోసం విదేశీ టెక్నాలజీపై ఆధారపడిన భారత్‌.. ఇప్పుడు సొంతంగా తయారు చేసుకునే దిశగా ముందుకు వెళ్తోంది.

అటామిక్ క్లాక్‌ ఎందుకు అవసరం?

ఉపగ్రహం సాయంతో మనం ఎక్కడ ఉన్నామో తెలుసుకోవడానికి కచ్చితమైన సమయం చాలా అవసరం. ఉదాహరణకు.. మనం ఫోన్‌లో గూగుల్ మ్యాప్స్‌ ఓపెన్ చేసి ఒక ప్రాంతానికి వెళ్లాలనుకున్నప్పుడు ఉపగ్రహాల నుంచి వచ్చే సిగ్నల్స్‌ ఆధారంగా మన లొకేషన్‌ను గుర్తిస్తారు. ఈ సిగ్నల్స్‌ ఉపగ్రహం నుంచి మన ఫోన్‌కు చేరడానికి ఎంత సమయం పట్టిందో లెక్కిస్తారు. ఆ లెక్కల ఆధారంగా మనం ఎక్కడ ఉన్నామో గుర్తిస్తారు. ఇక్కడ సమయం విషయంలో చిన్న పొరపాటు జరిగినా లొకేషన్‌ మారిపోతుంది.

లైట్‌, రేడియో సిగ్నల్స్‌ సెకనుకు దాదాపు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఇలాంటి సమయంలో సెకనులో బిలియన్‌వ వంతు (నానోసెకను) తేడా వచ్చినా లొకేషన్‌లో సుమారు 30 సెంటీమీటర్ల వ్యత్యాసం రావచ్చు. అందుకే ఉపగ్రహాలన్నీ ఒకే సమయాన్ని అనుసరించాలి. ఈ పనిని అటామిక్ క్లాక్‌లు చాలా కచ్చితంగా నిర్వహిస్తాయి.

భారత్‌ సొంత నావిగేషన్‌ వ్యవస్థ.. నావిక్‌!

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జీపీఎస్‌ వ్యవస్థను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇది అమెరికాకు చెందినది. రష్యాకు గ్లోనాస్‌, యూరప్‌కు గెలీలియో, చైనాకు బీడౌ వంటి సొంత నావిగేషన్‌ వ్యవస్థలు ఉన్నాయి. ఇతర దేశాల వ్యవస్థలపై ఆధారపడకుండా భారత్‌ కూడా సొంతంగా నావిగేషన్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. అదే నావిక్‌ (NavIC). దీని పూర్తి పేరు ఇండియన్‌ రీజినల్‌ నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్‌ (IRNSS). భారత్‌తో పాటు దేశ సరిహద్దుల నుంచి 1,500 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలకు లొకేషన్‌ సేవలు అందించడం దీని లక్ష్యం.

1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధ సమయంలో భారత్‌కు అవసరమైన జీపీఎస్‌ సమాచారాన్ని అమెరికా అందించకపోవడం కూడా సొంత నావిగేషన్‌ వ్యవస్థ అవసరాన్ని గుర్తు చేసింది. దీంతో విదేశీ వ్యవస్థలపై ఆధారపడకుండా మనకంటూ ఒక సొంత వ్యవస్థ ఉండాలని భారత్‌ నిర్ణయించింది.

2013 నుంచి 2016 మధ్య తొలి ఏడు నావిక్‌ ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. ప్రస్తుతం పాత ఉపగ్రహాల స్థానంలో కొత్త తరం
ఎన్‌వీఎస్‌ ఉపగ్రహాలను పంపుతోంది. ఇప్పటికే ఎప్‌వీఎస్‌ – 01, ఎప్‌వీఎస్‌ -02 ఉపగ్రహాలను ప్రయోగించగా.. ఇప్పుడు ఎప్‌వీఎస్‌ -03ను పంపేందుకు సిద్ధమైంది.

స్మార్ట్‌ఫోన్లలోనూ ఉపయోగం!

కొత్త తరం ఎప్‌వీఎస్‌ ఉపగ్రహాల వల్ల స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులకు కూడా ప్రయోజనం కలగనుంది. ఇప్పటివరకు నావిక్‌ వ్యవస్థలో L5, S బ్యాండ్ల సిగ్నల్స్‌ అందుబాటులో ఉన్నాయి. కొత్త ఉపగ్రహాల ద్వారా L1 సిగ్నల్‌ను కూడా అందిస్తున్నారు. ఈ సిగ్నల్‌కు అనుకూలంగా ఉండే స్మార్ట్‌ఫోన్లు, ఇతర పరికరాలు నావిక్‌ సేవలను ఉపయోగించుకోగలవు. దీంతో లొకేషన్‌ సేవలు మరింత విస్తరించే అవకాశం ఉంది. నావిక్‌ వ్యవస్థను రవాణా, విమానయానం, నౌకాయానం, వ్యవసాయం, అత్యవసర సేవలు, రక్షణ రంగాల్లో ఉపయోగించవచ్చు. మన దేశానికి సంబంధించిన నావిగేషన్‌ సేవలను మనమే నిర్వహించుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది.

‘ఒకే దేశం.. ఒకే సమయం’కు నావిక్‌ సాయం!

దేశమంతా ఒకే సమయాన్ని పాటించేలా కేంద్ర ప్రభుత్వం ‘ఒకే దేశం.. ఒకే సమయం’ (One Nation, One Time) విధానాన్ని తీసుకొస్తోంది. ఇందుకోసం 2026 ఆగస్టు 29న కొత్త నిబంధనలను ప్రకటించింది. దేశంలోని అన్ని ముఖ్యమైన రంగాల్లో భారత ప్రామాణిక సమయం (IST)నే అనుసరించేలా ఈ నిర్ణయం తీసుకుంది.

ఇందులో ఇస్రోకు చెందిన నావిక్‌ వ్యవస్థ కూడా కీలక పాత్ర పోషించనుంది. నావిక్‌ ఉపగ్రహాల ద్వారా భారత ప్రామాణిక సమయాన్ని వివిధ ప్రాంతాలకు అందించే అవకాశం ఉంది. ఇందుకు ఉపగ్రహాల్లో ఉండే అటామిక్ క్లాక్‌లు చాలా ముఖ్యం. ఇవి సమయాన్ని చాలా కచ్చితంగా లెక్కిస్తాయి. ఇప్పుడు NVS-03లో స్వదేశీ అటామిక్ క్లాక్‌ను పంపడం కూడా ఈ దిశగా మరో ముందడుగు.

బ్యాంకింగ్‌, డిజిటల్‌ చెల్లింపులు, మొబైల్‌ నెట్‌వర్క్‌లు, రైళ్లు, విద్యుత్‌ వ్యవస్థలు వంటి రంగాల్లో సమయం విషయంలో తేడాలు లేకుండా చూసేందుకు ఈ విధానం ఉపయోగపడుతుంది. అంటే దేశమంతా ఒకే సమయాన్ని పాటించడంతో పాటు, ఆ సమయాన్ని కచ్చితంగా అందించే వ్యవస్థలో నావిక్‌ కూడా తోడ్పడనుంది.