Tirumala | శ్రీవారి పాదాల చెంత జీఎస్ఎల్ వీ-ఎఫ్17 నమూనా రాకెట్..

జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17 ప్రయోగానికి ముందు తిరుమలలో ప్రత్యేక పూజలు


Tirumala | తిరుమల, ఆంధ్రప్రభ: ఇస్రో చైర్మన్‌ నారాయణన్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తన బృందంతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌ ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన ఆయన.. ఆనంద నిలయంలో శ్రీవారిని దర్శించుకున్నారు.

ఈసందర్భంగా ఇస్రో చేపట్టనున్న జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17, ఈఓఎస్‌-05 నమూనా రాకెట్‌ను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు.

ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17 ప్రయోగం సెప్టెంబర్‌ 4వ తేదీ తెల్లవారుజామున 2.55 గంటలకు జరగనుంది. శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం (షార్‌) రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఇస్రో బృందం తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించింది.